Home APవైసీపీది క్రెడిట్ చోరీ: సీఎం చంద్రబాబు

వైసీపీది క్రెడిట్ చోరీ: సీఎం చంద్రబాబు

by TaajaVartha

మేం కష్టపడి ప్రాజెక్టులు తెస్తే వైసీపీవి అబద్ధపు ప్రచారాలు.

కుప్పంలో మీడియా ప్రతినిధులతో ముఖ్యమంత్రి ఇష్టాగోష్ఠి.

రాష్ట్రానికి వచ్చే పరిశ్రమలను తరిమికొట్టడమే పనిగా పెట్టుకున్న వైసీపీ నాయకులు, కూటమి ప్రభుత్వం ఎంతో కష్టపడి తెస్తున్న ప్రతి ప్రాజెక్టును తామే తెచ్చినట్లు సిగ్గులేకుండా చెప్పుకుంటున్నారని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. గత ప్రభుత్వంలో అభివృద్ధిని అడ్డుకోవడమే కాకుండా, ఇప్పుడు కూడా అబద్ధపు ప్రచారాలతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. మూడు రోజుల పర్యటన నిమిత్తం కుప్పం వచ్చిన ఆయన, ఆదివారం మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్ఠిగా (చిట్‌చాట్) మాట్లాడారు. తనపైనా, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పైనా నిరంతరం దుష్ప్రచారం చేసేందుకు కొన్ని సోషల్ మీడియా గ్రూపులకు ‘గొడ్డలి పార్టీ’ నేతలు ప్రత్యేకంగా నిధులు సమకూరుస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు. హింస, అసభ్యత, వర్గవిభేదాలు, రౌడీయిజం వంటి వాటినే ఆ పార్టీ నమ్ముకుందని, వారి అడ్డంకులు ఎన్ని ఎదురైనా రాష్ట్రంలో అభివృద్ధి మాత్రం ఆగదని స్పష్టం చేశారు.

కుప్పం నియోజకవర్గానికి మునుపెన్నడూ చూడని రీతిలో ప్రాజెక్టులు వస్తున్నాయని, రోడ్లు, కమ్యూనికేషన్ సహా అన్ని రంగాల్లో కనెక్టివిటీ పెంచుతున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు. త్వరలోనే అభివృద్ధి చెందిన సరికొత్త కుప్పాన్ని ప్రజలు చూస్తారని భరోసా ఇచ్చారు. వికేంద్రీకృత అభివృద్ధి విధానంలో భాగంగా రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గాన్ని సమానంగా అభివృద్ధి చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఆయన పునరుద్ఘాటించారు. రాష్ట్రానికి క్వాంటం, సెమీ కండక్టర్ రంగాల్లో భారీ పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని వివరించారు. ఇందులో భాగంగా ఈ ఏడాది డిసెంబర్ నాటికి అమరావతిలో ‘క్వాంటం కంప్యూటింగ్ సెంటర్’ కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయని వెల్లడించారు. ఇంధన రంగంలో సౌర, పవన విద్యుత్‌తో పాటు ఇతర అత్యాధునిక విధానాలను అమలు చేస్తున్నామన్నారు. దేశంలోని ప్రముఖ ఉక్కు పరిశ్రమలైన ఆర్సెలర్ మిట్టల్, జేఎస్‌డబ్ల్యూ వంటి సంస్థలు ఏపీలో తమ ప్రాజెక్టులను ఏర్పాటు చేస్తున్నాయని ఈ సందర్భంగా గుర్తుచేశారు.

గత పాలకులు విలువైన భూములు, ఖనిజ సంపదను ఒకే వ్యక్తి ప్రయోజనం కోసం కట్టబెట్టారని, ఏజెన్సీ ప్రాంతాలను గంజాయి సాగుకు కేంద్రంగా మార్చారని చంద్రబాబు తీవ్ర ఆరోపణలు చేశారు. కోట్లాది భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా తిరుమల ప్రసాదాన్ని సైతం కల్తీ చేశారని, అలాంటి వారు ఇప్పుడు నీతులు చెప్పడం సిగ్గుచేటని వ్యాఖ్యానించారు. పరిశ్రమల స్థాపనతో పాటు పర్యావరణ పరిరక్షణ, పచ్చదనానికి కూడా తమ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.

Related Articles

Leave a Comment

Are you sure want to unlock this post?
Unlock left : 0
Are you sure want to cancel subscription?
-
00:00
00:00
Update Required Flash plugin
-
00:00
00:00