Home Jobs & Educationఎన్నికల బరిలోకి ప్రశాంత్ కిశోర్

ఎన్నికల బరిలోకి ప్రశాంత్ కిశోర్

by TaajaVartha

బీజేపీ కంచుకోటలో పోటీకి సిద్ధం

ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త, జన్‌ సురాజ్ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిశోర్ (పీకే) తొలిసారిగా ప్రత్యక్ష ఎన్నికల బరిలోకి దిగబోతున్నారు. బిహార్‌లోని అత్యంత కీలకమైన బంకీపుర్‌ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికలో ఆయన స్వయంగా పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు జన్‌ సురాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మనోజ్ భారతీ పీకే అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు. ఈ నెల 30న బంకీపుర్‌ స్థానానికి పోలింగ్ జరగనుండగా, ఆగస్టు 3న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను వెల్లడిస్తారు. గత ఎన్నికల్లో ఇక్కడి నుంచి గెలుపొందిన భాజపా జాతీయ నాయకుడు నితిన్ నబీన్, అనంతరం తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి రాజ్యసభకు ఎన్నికవడంతో ఈ ఉప ఎన్నిక అనివార్యమైంది. భాజపాకు తిరుగులేని కంచుకోటగా భావించే ఈ స్థానానికి కమలం పార్టీ ఇంకా తమ అభ్యర్థిని ప్రకటించకపోగా, ప్రశాంత్ కిశోర్ నేరుగా రంగంలోకి దిగడంతో ఇక్కడ రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది.

ఎన్నికల వ్యూహకర్త హోదా నుంచి సొంతంగా రాజకీయ పార్టీని స్థాపించిన ప్రశాంత్ కిశోర్‌కు గత ఎన్నికల్లో తీవ్ర భంగపాటు ఎదురైన సంగతి తెలిసిందే. ఆ ఎన్నికల్లో పీకే స్వయంగా పోటీ చేయనప్పటికీ, ఆయన నేతృత్వంలోని జన్‌ సురాజ్ పార్టీ రాష్ట్రంలోని మొత్తం 243 స్థానాలకు గానూ 238 సీట్లలో అభ్యర్థులను నిలబెట్టింది. అయితే, ఒక్క సీటులోనూ విజయం సాధించలేక ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఈ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ అప్పట్లో పీకే కొన్ని రోజుల పాటు మౌనవ్రతం కూడా ఆచరించారు. ఈ నేపథ్యంలో, దేశ వ్యాప్తంగా మూడు రాష్ట్రాల్లోని ఉప ఎన్నికల నిమిత్తం కేంద్ర ఎన్నికల సంఘం మూడు రోజుల క్రితమే షెడ్యూల్ విడుదల చేయగా, జులై 6న అధికారిక నోటిఫికేషన్ వెలువడనుంది. ఈసారి ఎలాగైనా తన సత్తా చాటాలని పీకే స్వయంగా బరిలోకి దిగుతుండటంతో అందరి దృష్టి బంకీపుర్‌ వైపు మళ్లింది.

Leave a Comment

Are you sure want to unlock this post?
Unlock left : 0
Are you sure want to cancel subscription?
-
00:00
00:00
Update Required Flash plugin
-
00:00
00:00