Home Sportsలంకపై ఇండియా-ఎ ఘన విజయం

లంకపై ఇండియా-ఎ ఘన విజయం

by TaajaVartha

లంకపై ఇండియా-ఎ ఘన విజయం

  • 10 వికెట్ల తేడాతో టెస్టుతో పాటు సిరీస్ కైవసం!
  • రెండో ఇన్నింగ్స్‌లో 6 వికెట్లతో చెలరేగిన గూర్నూర్ బ్రార్..
  • సునాయాసంగా లక్ష్యాన్ని ఛేదించిన ఓపెనర్లు

శ్రీలంక-ఎ జట్టుతో జరిగిన రెండో అనధికార టెస్టు మ్యాచ్‌లో భారత్-ఎ జట్టు 10 వికెట్ల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. ఈ అద్భుత విజయంతో రెండు మ్యాచ్‌ల ఈ టెస్టు సిరీస్‌ను ఇండియా-ఎ 1-0 తేడాతో సొంతం చేసుకోగా, ఇరు జట్ల మధ్య జరిగిన తొలి మ్యాచ్ డ్రాగా ముగిసిన సంగతి తెలిసిందే. ఆదివారం, ఆట చివరి రోజైన తరుణంలో.. తొలి ఇన్నింగ్స్‌లో 541/8 ఓవర్‌నైట్ స్కోరుతో బ్యాటింగ్ కొనసాగించిన భారత్-ఎ జట్టు మరో రెండు పరుగులు మాత్రమే జోడించి తొమ్మిదో వికెట్ కోల్పోయింది. అంతకుముందు రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగిన రుతురాజ్ గైక్వాడ్ (13) తిరిగి బ్యాటింగ్‌కు రాకపోవడంతో భారత తొలి ఇన్నింగ్స్ అక్కడితో ముగిసింది. అంతకుముందు శ్రీలంక-ఎ జట్టు తన తొలి ఇన్నింగ్స్‌లో 366 పరుగులకు ఆలౌటైన విషయం విదితమే.

అనంతరం భారీ ఇన్నింగ్స్ లోటుతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన శ్రీలంక-ఎ జట్టు, భారత బౌలర్ల ధాటికి కేవలం 209 పరుగులకే కుప్పకూలింది. లంక బ్యాటర్లలో అషేన్ బండార (87) ఒక్కడే అర్ధసెంచరీతో ఒంటరి పోరాటం చేయగా, మిగతా బ్యాటర్లందరూ భారత లైన్ అండ్ లెంగ్త్ బౌలింగ్‌ను తట్టుకోలేక తక్కువ స్కోరుకే పెవిలియన్ చేరారు. భారత బౌలర్లలో యువ పేసర్ గూర్నూర్‌ బ్రార్ అద్భుత స్పెల్‌తో 6 వికెట్లు పడగొట్టి లంక పతనాన్ని శాసించగా.. సారాంశ్ జైన్ 2 వికెట్లు, ఆకిబ్ నబీ దార్, యశ్ ఠాకూర్ చెరో వికెట్ దక్కించుకున్నారు. ఆ తర్వాత శ్రీలంక విధించిన 33 పరుగుల స్వల్ప విజయ లక్ష్యాన్ని భారత్-ఎ జట్టు కేవలం 6.2 ఓవర్లలోనే వికెట్ నష్టపోకుండా సునాయాసంగా ఛేదించింది. ఓపెనర్లు సాయి సుదర్శన్‌ (25 నాటౌట్), అమన్‌ మోఖడే (11 నాటౌట్)లు అజేయంగా నిలిచి జట్టుకు చిరస్మరణీయ విజయాన్ని అందించారు.

Leave a Comment

Are you sure want to unlock this post?
Unlock left : 0
Are you sure want to cancel subscription?
-
00:00
00:00
Update Required Flash plugin
-
00:00
00:00