Vijayawada: కూటమి ధర్మాన్ని పాటిస్తూనే జనసేన పార్టీని సంస్థగతంగా క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేయాలని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి, విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకులు కందుల దుర్గేష్ పిలుపునిచ్చారు. విజయవాడలో నిర్వహించిన జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తల అత్యవసర సమీక్షా సమావేశంలో ఆయన పాల్గొని జన సైనికులు, వీర మహిళలు, పార్టీ నాయకులకు దిశానిర్దేశం చేశారు. రాబోయే స్థానిక సంస్థలు, విజయవాడ కార్పొరేషన్ ఎన్నికలకు అందరూ సన్నాహకంగా సిద్ధం కావాలని, పార్టీ బలాన్ని పెంచుకోవడం ద్వారా ఎక్కువ స్థానాల్లో పోటీ చేసే అవకాశం లభిస్తుందని పేర్కొంటూ.. విజయవాడ కార్పొరేషన్ పీఠంపై కూటమి విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
పార్టీ సిద్ధాంతాలే బలం – పేదల ఆశాజ్యోతి జనసేన
సమీక్షా సమావేశంలో మంత్రి దుర్గేష్ మాట్లాడుతూ.. విజయవాడ పార్లమెంటు నియోజకవర్గ పరిశీలకుడిగా వారం రోజుల పాటు అన్ని నియోజకవర్గాల జనసైనికులు, వీర మహిళలతో భేటీ అయిన రోజులను గుర్తుచేసుకున్నారు. ఎన్టీఆర్ జిల్లాలో పార్టీ బలోపేతం కోసం స్థానిక నాయకత్వం చూపిస్తున్న చొరవ అత్యంత ఆదర్శనీయమని కొనియాడారు. “నాడు పార్టీ పదవుల కోసం దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరితో నేను స్వయంగా మాట్లాడాను. వారంతా 2014 నుండి పార్టీ సిద్ధాంతాలను నమ్మి పనిచేస్తున్నవారే. పేద ప్రజల ప్రతినిధులైన ఆటో డ్రైవర్లు, రిక్షావాలాలు, దినసరి కూలీలు తమ కష్టార్జితం నుంచి రూపాయి రూపాయి కూడబెట్టి పార్టీ కోసం ఖర్చు చేశారు. ఏ ఒక్క కులానికో పరిమితం కాకుండా సమాజంలోని అన్ని వర్గాల ఆశాజ్యోతిగా జనసేన నిలిచింది. ఇంతటి బలమైన భావజాలం ఉన్న సైన్యం ప్రపంచంలో ఒక్క జనసేనకే సాధ్యం” అని మంత్రి పేర్కొన్నారు. రాజకీయ చైతన్యం కలిగిన విజయవాడ నగరంలో జనసేన నాయకత్వం మరింత పెంపొందాల్సిన అవసరం ఉందన్నారు.
అరాచక పాలనకు స్వస్తి.. రెండేళ్ల సుపరిపాలన
రాష్ట్రంలో గతంలో ఉన్న నియంతృత్వ, అరాచక పాలనను అంతమొందించడానికి జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ‘ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో తెలుసుకొని’ కూటమి ప్రభుత్వ ఏర్పాటులో కీలక పాత్ర పోషించారని తెలిపారు. గడిచిన రెండేళ్లుగా రాష్ట్రంలో అత్యద్భుతమైన సుపరిపాలన సాగుతోందని, ప్రజల సమస్యల పరిష్కారంలో కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడూ ముందుంటుందని స్పష్టం చేశారు.
త్యాగాలకు ప్రతిరూపం జనసైనికులు.. కష్టపడేవారికి తగిన గుర్తింపు
జనసేన పార్టీకి కేటాయించిన బాధ్యతలకు ప్రజాప్రతినిధులు, మంత్రులు పూర్తి న్యాయం చేస్తున్నారని మంత్రి దుర్గేష్ చెప్పారు. పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ రైతన్నల నుంచి చివరి గింజ వరకు ధాన్యం కొనుగోలు చేసి, 24 గంటల్లోనే ఖాతాల్లో నగదు జమ చేస్తున్నారని, ‘దీపం-2’ కింద ఉచిత గ్యాస్ సిలిండర్లు, నాణ్యమైన సన్న బియ్యం అందిస్తూ పాలనలో సత్తా చాటుతున్నారని వివరించారు. జనసేనాని పవన్ కళ్యాణ్ ఆశయాలకు అనుగుణంగా పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు అత్యుత్తమంగా సేవలందిస్తున్నారని తెలిపారు.

సమీక్షా సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి కందుల దుర్గేష్
విజయవాడపై జనసేన పతాకం.. స్థానిక ఎన్నికల్లో నూటికి నూరు శాతం విజయం
ప్రస్తుత రాజకీయ వాతావరణం కూటమికి అత్యంత అనుకూలంగా ఉందని, టీడీపీ-జనసేన-బీజేపీ కలిసి పోటీ చేయనున్న రాబోయే కార్పొరేషన్, స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం నూటికి నూరు శాతం తథ్యమని మంత్రి దుర్గేష్ ధీమా వ్యక్తం చేశారు. గతంలో ఎటువంటి మద్దతు లేని సమయంలోనే గెలిచిన వీరసైనికులను స్ఫూర్తిగా తీసుకుని విజయవాడ నగరంలో జనసేన జెండాను రెపరెపలాడించాలని పిలుపునిచ్చారు. కష్టపడి పనిచేసే ప్రతి కార్యకర్తకూ పార్టీలో తగిన గుర్తింపు, భవిష్యత్తు ఉంటాయని, ఎవరికి ఏ బాధ్యత ఇవ్వాలో పవన్ కళ్యాణ్ కు పూర్తి స్పష్టత ఉందన్నారు.
సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేసిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కి, మంత్రి నాదెండ్ల మనోహర్ కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ, కార్యకర్తలకు మంత్రి దుర్గేష్ అభినందనలు తెలిపారు. అనంతరం, కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్న అభ్యర్థుల నుంచి మంత్రి దుర్గేష్ మరియు పార్టీ నేతలు స్వయంగా బయోడేటా ఫారాలను స్వీకరించి, వారితో ముఖాముఖి మాట్లాడారు.
