Home » నరసరావుపేట వల్లపు చెరువును మోడల్ ట్యాంక్‌గా తీర్చిదిద్దేందుకు ఎమ్మెల్యే అరవింద బాబు చర్యలు

నరసరావుపేట వల్లపు చెరువును మోడల్ ట్యాంక్‌గా తీర్చిదిద్దేందుకు ఎమ్మెల్యే అరవింద బాబు చర్యలు

by TaajaVartha
Historic Vallapu Cheruvu in Narasaraopet to be Developed into a Model Tank: MLA Chadalavada

Palnadu District: పల్నాడు జిల్లా కేంద్రమైన నరసరావుపేటలో సుమారు 200 సంవత్సరాల చరిత్ర కలిగిన చారిత్రాత్మక వల్లపు చెరువు అభివృద్ధి పనులు అత్యంత వేగంగా కొనసాగుతున్నాయని స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద బాబు తెలిపారు. ఈ ప్రాజెక్టు అభివృద్ధి పనులను పల్నాడు జిల్లా డ్వామా (DWMA) ప్రాజెక్ట్ డైరెక్టర్ ఎం.సిద్ధాలింగమూర్తితో కలిసి ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే, పనుల నిర్మాణ నాణ్యతలో ఎలాంటి రాజీ పడకుండా త్వరితగతిన పూర్తి చేసి నిర్ణీత గడువులోగా ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు.

ప్రధానమంత్రి కృషి యోజన (PMKSY 2.0) కింద రూ.1.30 కోట్ల అంచనా వ్యయంతో ఈ ప్రతిష్టాత్మక అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఇందులో భాగంగా తొలి విడతగా రూ.50 లక్షల నిధులు మంజూరు కాగా, మే 22న ప్రారంభమైన పనులు ప్రస్తుతం శరవేగంగా సాగుతున్నాయి. నరసరావుపేట పట్టణానికి తలమానికమైన ఈ చారిత్రక చెరువును ఒక సుందరమైన ‘మోడల్ ట్యాంక్’గా అభివృద్ధి చేయడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఎమ్మెల్యే చదలవాడ స్పష్టం చేశారు.

ఈ ప్రాజెక్టు ద్వారా పట్టణంలో తాగునీటి భద్రత, భూగర్భ జలాల మట్టం పెంపు, పర్యావరణ పరిరక్షణ సాధించడమే కాకుండా ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణం లభిస్తుందని ఎమ్మెల్యే వివరించారు. ప్రస్తుతం చెరువులో పూడికతీత, ట్యాంక్‌బండ్ బలోపేతం, రిటైనింగ్ వాల్ నిర్మాణం, వాకింగ్ ట్రాక్ ఏర్పాటు మరియు పరిసరాల శుభ్రత వంటి పనులు కొనసాగుతున్నాయి. రాబోయే రోజుల్లో ఇరువైపులా పచ్చని మొక్కల పెంపకం, సోలార్ లైటింగ్, పెద్దల కోసం బెంచీలు, చిన్నారుల కోసం పార్క్, బోటింగ్ సౌకర్యంతో పాటు చెరువు మధ్యలో ఆకర్షణీయమైన శివుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించి ప్రధాన పర్యాటక విహార కేంద్రంగా తీర్చిదిద్దనున్నట్లు చెప్పారు. అలాగే ప్రభుత్వ నిధులతో పాటు ఎన్ఆర్ఐ (NRI)ల స్వచ్ఛంద సహకారంతో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో గుడి కమిటీ చైర్మన్ పాండురంగారావు, వివిధ శాఖల అధికారులు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు.

Related Articles

Leave a Comment

Are you sure want to unlock this post?
Unlock left : 0
Are you sure want to cancel subscription?
-
00:00
00:00
Update Required Flash plugin
-
00:00
00:00