కమీషన్ల కక్కుర్తితో కాళేశ్వరాన్ని ముంచారు!
- దొంగే దొంగ అన్నట్లుగా కేటీఆర్, బీఆర్ఎస్ నేతల నాటకాలు
- నీళ్లు నిలిపినపుడు కూలితే భద్రాచలం, 40 ఊళ్లు జలసమాధి
- బీఆర్ఎస్ అవినీతి పాపమే ప్రాజెక్టు పాలిట శాపం
- ఎన్డీఎస్‌ఏ నిపుణులకంటే కేటీఆర్‌కే ఎక్కువ నాలెడ్జ్ ఉందా?
- 2027 ఆగస్టు నాటికి మూడు బ్యారేజీల మరమ్మతులు
- బీఆర్ఎస్ నేతలపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ధ్వజం
కాళేశ్వరం ప్రాజెక్టును నిలువునా ముంచింది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కమీషన్ల కక్కుర్తి కోసం ఇంజనీరింగ్ భద్రతను గాలికొదిలేశారని మండిపడ్డారు. ఆదివారం సచివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ నేతల తీరు ఉల్టా చోర్ కొత్వాల్‌కో డాంటే దొంగే అన్నట్లుగా ఉందని ఉత్తమ్ విమర్శించారు. బీఆర్ఎస్ హయాంలోనే ప్రాజెక్టును నాశనం చేసి ఇప్పుడు కేటీఆర్ కన్నెపల్లి పంప్‌హౌస్ వద్దకు వెళ్లి నీళ్లు ఇవ్వాలంటూ నాటకాలు ఆడుతున్నారని తీవ్రంగా మండిపడ్డారు. పదేళ్లలో ఇరిగేషన్ శాఖను సర్వనాశనం చేస్తే, కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు దాన్ని గాడిలో పెడుతోందని స్పష్టం చేశారు.
ప్రమాదకర స్థితిలో కాళేశ్వరం బ్యారేజీలు
కాళేశ్వరం బ్యారేజీల పునాదులు అత్యంత ప్రమాదకర స్థితిలో ఉన్నాయని మంత్రి గుర్తుచేశారు. ఒకవేళ కేటీఆర్ మాటలు విని ఇప్పుడు బ్యారేజీల్లో నీళ్లు నిల్వ చేస్తే అవి కూలిపోయి భద్రాచలంతో పాటు దిగువన ఉన్న 40 గ్రామాలు వరదలో కొట్టుకుపోవడం ఖాయమని మంత్రి ఉత్తమ్ హెచ్చరించారు. ప్రాజెక్టును కట్టింది, అది కుంగిపోయింది బీఆర్ఎస్ హయాంలోనేనని ఇంజనీర్లు స్పష్టమైన నివేదికలు ఇచ్చారన్నారు. ప్రాజెక్టును ఇలానే వాడితే ప్రమాదమని జాతీయ, అంతర్జాతీయ నిపుణులు తేల్చి చెప్పారని స్పష్టం చేశారు. అసలు నిపుణులైన ఎన్డీఎస్‌ఏ అధికారుల కంటే కేటీఆర్‌కే ఎక్కువ నాలెడ్జ్ ఉందా? అని ఆయన సూటిగా ప్రశ్నించారు.
మూడు బ్యారేజీల మరమ్మతులపై ప్రభుత్వం అత్యంత శాస్త్రీయంగా ముందుకెళ్తోందని ఉత్తమ్ స్పష్టం చేశారు. ప్రస్తుతం బ్యారేజీల టెస్టింగ్ చివరి దశలో ఉందని, ఐఐటీ బాంబే నివేదిక రాగానే అసలు వాస్తవాలు బయటపడతాయన్నారు. బహుశా డయాఫ్రమ్ వాల్ కూడా కొత్తగా కట్టాల్సి రావొచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. అక్టోబర్ నాటికి రిపేర్లపై తుది నిర్ణయం తీసుకుని, నెలరోజుల్లో పనులు మొదలుపెడతామన్నారు. వచ్చే వానాకాలం అనగా 2027 జూలై-ఆగస్టు నాటికి మూడు బ్యారేజీల మరమ్మతులను ప్రభుత్వం పూర్తి చేస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
తుమ్మిడిహట్టి వద్ద ప్రాజెక్టు కట్టి ఉంటే ఉత్తర తెలంగాణ ఎప్పుడో సస్యశ్యామలం అయ్యేదని మంత్రి అభిప్రాయపడ్డారు. కేవలం కాంగ్రెస్‌కు మంచి పేరు వస్తుందన్న అక్కసుతో, కమీషన్లకు కక్కుర్తి పడే డిజైన్ మార్చి మేడిగడ్డకు తీసుకెళ్లారని ఆరోపించారు. అయితే ప్రస్తుతం తుమ్మిడిహట్టి నుంచి గ్రావిటీ ద్వారా 80 టీఎంసీల నీటిని తెచ్చేందుకు ప్రణాళికలు రచిస్తున్నామన్నారు. తుమ్మిడిహట్టి, ఎల్లంపల్లి విషయమై ఇప్పటికే మహారాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నామని వెల్లడించారు. ఎల్‌నినో అనేది ప్రపంచ స్థాయి సమస్య అని, దాని ప్రభావం రాష్ట్రంపై పడకుండా ముందస్తు కార్యాచరణతో సిద్ధంగా ఉన్నామని ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు.