కాళేశ్వరం వరం.. రేవంత్ శనేశ్వరం!
- వారం రోజులు కేసీఆర్‌కి అప్పగించు.. రాష్ట్రమంతా నీళ్లు పారిస్తాం
- కక్ష సాధింపుతోనే ప్రాజెక్టును నిలిపేసిన ప్రభుత్వం
- మేడిగడ్డతో పన్లేదు.. కన్నెపల్లి నుంచే ఎత్తిపోతలు
- మోటార్లు ఆన్ చేయకుంటే 50 వేల మందితో ముట్టడి
- రాష్ట్ర ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్
జయశంకర్ భూపాలపల్లి: తెలంగాణ రైతాంగానికి కాళేశ్వరం ప్రాజెక్టును కేసీఆర్ వరంగా ఇస్తే, కాంగ్రెస్ సీఎం రేవంత్ రెడ్డి మాత్రం రాష్ట్రానికి పట్టిన శనేశ్వరంగా మారారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విరుచుకుపడ్డారు. కేవలం రాజకీయ కక్ష సాధింపుల కోసమే కాళేశ్వరాన్ని ఉద్దేశపూర్వకంగా పడావు పెట్టి రైతులను తీవ్ర గోస పెడుతున్నారని ఆయన మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం అడుగడుగునా పోలీసులతో అడ్డుకున్నా వాటన్నింటినీ దాటుకుని ఆదివారం ఆయన బీఆర్ఎస్ నేతలతో కలిసి కన్నెపల్లి పంప్ హౌస్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. కేసీఆర్‌కు కేవలం వారం రోజులు ప్రాజెక్టును అప్పజెబితే, తెలంగాణ అంతటికీ నీళ్లు పారించి చూపుతామని ప్రభుత్వానికి సవాల్ విసిరారు.
మేడిగడ్డ బ్యారేజీతో ఎలాంటి అవసరం లేకుండానే కన్నెపల్లి పంప్ హౌస్ మోటార్లు ఆన్ చేసి నీటిని ఎత్తిపోయొచ్చని కేటీఆర్ స్పష్టం చేశారు. ఈ విషయం కాంగ్రెస్ నాయకులకు కూడా తెలుసని, కానీ ఒకవేళ నీళ్లిస్తే ఎక్కడ యూరియా, మద్దతు ధర, బోనస్, కరెంటు ఇవ్వాల్సి వస్తుందోనన్న భయంతోనే ప్రభుత్వం మోటార్లు ఆన్ చేయడం లేదని ఆరోపించారు. కరువు పరిస్థితుల్లోనూ కన్నెపల్లి వద్ద పుష్కలంగా నీళ్లున్నాయని, కానీ నేడు 98 వేల క్యూసెక్కుల నీళ్లు వృథాగా సముద్రం పాలవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. మేడిగడ్డ పిల్లర్ల నిర్మాణానికి ఎల్ అండ్ టీ సంస్థ తన సొంత ఖర్చుతో ముందుకొచ్చినా ప్రభుత్వం ఎందుకు అనుమతించడం లేదని ఆయన నిలదీశారు.
కాంగ్రెస్ అసమర్థత, అవినీతి వల్లే ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ కుప్పకూలి 8 మంది చనిపోయారని కేటీఆర్ ఆరోపించారు. సుంకిశాల గోడ కూలినా, వట్టెం పంప్ హౌస్ కొట్టుకుపోయినా ఈ దరిద్రపు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏమాత్రం పట్టింపు లేదని మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి రూ.94 వేల కోట్లు ఖర్చు అయితే.. ఏకంగా లక్ష కోట్ల అవినీతి ఎలా జరుగుతుందని నిలదీశారు. ఏనాడూ నీరు చూడని సూర్యాపేట జిల్లాకు సైతం సాగునీరు అందించింది కాళేశ్వరం ప్రాజెక్టేనని, వరి ఉత్పత్తిలో పంజాబ్‌ను మించి రాష్ట్రం మొదటి స్థానంలో నిలవడానికి ఈ ప్రాజెక్టే కారణమని ఆయన గుర్తుచేశారు.
సీఎం రేవంత్‌కు సోయి లేక కాళేశ్వరాన్ని పడావు పెట్టడం వల్లే.. నేడు హైదరాబాద్‌లో తాగునీటి కోసం 15 వేల ట్యాంకర్లు పెరిగాయని కేటీఆర్ ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో తీవ్ర వర్షాభావ పరిస్థితులున్న దృష్ట్యా ప్రభుత్వం తక్షణమే మేల్కొని కన్నెపల్లి పంపులను ఆన్ చేసి తీరాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో 50 వేల మందితో కన్నెపల్లి పంప్ హౌస్‌ను ముట్టడిస్తామని ఆయన తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఈ పర్యటనలో మధుసూదనాచారి, జగదీష్ రెడ్డి, గంగుల కమలాకర్, సత్యవతి రాథోడ్, కొప్పుల ఈశ్వర్ తదితర సీనియర్ నాయకులు, వేలాది మంది కార్యకర్తలు పాల్గొన్నారు.