కూటమి పాలనలో రౌడీ పోలీస్ రాజ్యం
ఎక్స్ వేదికగా వైఎస్ జగన్ తీవ్ర ధ్వజం
ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం రాజకీయ అణచివేత చర్యల కోసమే పోలీసు వ్యవస్థను వాడుకుంటూ, ప్రశ్నించే వారి గొంతు నొక్కేలా అత్యంత ప్రమాదకర ధోరణిలో నడిపిస్తోందని వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. “హే రామ్… సేవ్ ఆంధ్రప్రదేశ్” అంటూ సోషల్ మీడియా వేదికగా ఆయన రాష్ట్ర ప్రభుత్వ తీరును ఎండగట్టారు. రాష్ట్రంలో మహిళలు, చిన్నారులపై నేరాలు జరుగుతున్నా పోలీసులు కదలడం లేదని, తునిలో చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యమై నెల రోజులు దాటినా ఆచూకీ లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కావలిలో గిరిజన మహిళపై దాడి జరిగితే నిందితులను వదిలి బాధితులపైనే ఎదురు కేసులు పెట్టారని, పెద్దాపురంలో దివ్యాంగురాలైన బాలికపై జరిగిన దాడిలో నిందితులతో పోలీసులు కుమ్మక్కయ్యారని ఆరోపించారు. సాయికృష్ణ, గంగమ్మ, తిరుపతమ్మల లాకప్‌డెత్‌లు, క్రాంతికుమార్ ఆత్మహత్య వంటి ఘటనలు రాష్ట్ర పోలీస్ వ్యవస్థకు తీవ్ర తలవంపులు తెచ్చాయని, వీటన్నింటి నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికే చంద్రబాబు నిత్యం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని మండిపడ్డారు.
ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్న యాక్టివిస్టులపై బెయిల్ రాని సెక్షన్లు పెట్టి, వారిని ఆర్గనైజ్డ్ క్రిమినల్స్‌గా చిత్రీకరించాలని ప్రతి స్టేషన్ హౌస్ ఆఫీసర్‌కు హుకుం జారీ చేయడం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనని వైఎస్ జగన్ విమర్శించారు. యూట్యూబ్ ఇన్‌ఫ్లూయెన్సర్ కేవీఆర్‌ను చట్టవిరుద్ధంగా హైదరాబాద్ నుండి తరలించడం, యూట్యూబర్ రావణ్‌కు కోర్టుల్లో బెయిల్ వచ్చినా అహంకారంతో పోలీస్ స్టేషన్లపై దాడులు చేయించి తీవ్రవాద అభియోగాలు మోపడం దుర్మార్గమన్నారు. గతంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్‌లు చేసిన విమర్శలనే ఇప్పుడు సోషల్ మీడియా యాక్టివిస్టులు ప్రశ్నిస్తున్నారని, అలాంటప్పుడు అవే అభియోగాలు వీరిపై కూడా పెట్టాలి కదా అని ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్‌కు కావాల్సింది రౌడీ పోలీస్ రాజ్యమో, జంగిల్ రాజో కాదని.. ప్రజలకు భద్రత కల్పిస్తూ, రాజకీయాలకు కాకుండా రాజ్యాంగానికి లోబడి నడిచే పోలీసు వ్యవస్థ, పాలన కావాలని వైఎస్ జగన్ డిమాండ్ చేశారు.