ప్రవాసాంధ్రులంతా ఏపీ బ్రాండ్ అంబాసిడర్లే: మంత్రి నారా లోకేశ్

దక్షిణ కొరియా సియోల్ తెలుగు డయాస్పోరా సమావేశంలో ఐటీ మంత్రి పిలుపు.

దక్షిణ కొరియాలో నివసిస్తున్న ప్రవాసాంధ్రులంతా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బ్రాండ్ అంబాసిడర్లని, వారంతా వెళ్ళే ప్రతీచోటా ఏపీ అభివృద్ధి గాథను వివరించాలని రాష్ట్ర విద్యా, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ పిలుపునిచ్చారు. సియోల్‌లో నిర్వహించిన తెలుగు డయాస్పోరా సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి లోకేశ్ మాట్లాడుతూ.. దక్షిణ కొరియా సాధించిన శ్రమ, ఆవిష్కరణల విజయగాథ ఆంధ్రప్రదేశ్‌కు ఎంతో ప్రేరణనిస్తుందన్నారు. గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో కియా మోటార్స్ తమ ప్లాంట్‌ను ఏపీలో స్థాపించినప్పుడు వేగవంతమైన అనుమతులు, మౌలిక సదుపాయాలు కల్పించి ఒక పూర్తిస్థాయి ఆటోమొబైల్ ఎకోసిస్టమ్‌ను అభివృద్ధి చేశామని గుర్తుచేశారు. అదే తరహాలో ఐటీ, సెమీ కండక్టర్లు, గ్రీన్ హైడ్రోజన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వంటి రంగాల్లో దక్షిణ కొరియాకు భారతదేశంలోనే ఆంధ్రప్రదేశ్ అత్యంత నమ్మకమైన భాగస్వామి కావడానికి సిద్ధంగా ఉందన్నారు.

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దార్శనిక నాయకత్వంలో రాష్ట్రం సరికొత్త అభివృద్ధి దశలోకి ప్రవేశించిందని, స్పీడ్, స్టెబిలిటీ, సర్వీస్ అనే ‘3S’ మోడల్‌తో పెట్టుబడిదారుల నమ్మకాన్ని తిరిగి సాధిస్తున్నామని మంత్రి లోకేశ్ స్పష్టం చేశారు. మన యువత గ్లోబల్ స్థాయిలో రాణించేలా పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా విద్యా వ్యవస్థను, పాఠ్యాంశాలను సమగ్రంగా పునఃరూపకల్పన చేస్తున్నట్లు వెల్లడించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు కుటుంబాలకు, విద్యార్థులకు ‘ఏపీఎన్ఆర్టీ’ (APNRT) ద్వారా ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. బలమైన రాష్ట్రాలే బలమైన దేశాన్ని నిర్మిస్తాయని తాము నమ్ముతామని పేర్కొంటూ.. ఏపీని పెట్టుబడులకు, ఉపాధికి అత్యుత్తమ ప్రదేశంగా మార్చేందుకు, బలమైన భారత్ నిర్మాణంలో భాగస్వాములు కావడానికి ప్రవాసాంధ్రులు, పారిశ్రామికవేత్తలు తరలిరావాలని మంత్రి లోకేశ్ పిలుపునిచ్చారు.

Related posts

కూటమి పాలనలో రౌడీ పోలీస్ రాజ్యం ఎక్స్ వేదికగా వైఎస్ జగన్ తీవ్ర ధ్వజం

వైసీపీది క్రెడిట్ చోరీ: సీఎం చంద్రబాబు