Amaravati ChampionShip: క్రీడారంగంలో ఎం.ఏ.ఎం (MAM) ఫార్మసీ కాలేజ్ విద్యార్థినులు మరోసారి తమ ప్రతిభను నిరూపించుకున్నారు. ప్రతిష్ఠాత్మక ‘అమరావతి ఛాంపియన్‌షిప్’ జిల్లా స్థాయి బ్యాడ్మింటన్ పోటీలకు నర్సరావుపేట ( Narasaraopeta ) ఎంఏఎం ఫార్మసీ కాలేజ్ చెందిన విద్యార్థినులు యామిని, రమ్య ఎంపికయ్యారు. ఇటీవల నిర్వహించిన ఎంపిక ట్రయల్స్‌లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి, ఈ జిల్లా స్థాయి పోటీల్లో పాల్గొనే అర్హత సాధించినట్లు కళాశాల యజమాన్యం తెలిపింది.
జిల్లా స్థాయి పోటీలకు ఎంపికైన యామిని, రమ్యలను కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం. ప్రసాదరావు ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు క్రమశిక్షణ, పట్టుదల, నిరంతర సాధనతో ఉన్నత శిఖరాలను అధిరోహించాలి. రాబోయే జిల్లా స్థాయి పోటీల్లోనూ ఇదే రకమైన ప్రతిభను కనబరిచి కళాశాలకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.
కాలేజ్ ఛైర్మన్ మేదరమెట్ల శేషగిరిరావు, డైరెక్టర్ దరువూరి శ్రావ్య ఎంపికైన విద్యార్థినులకు శుభాకాంక్షలు తెలియజేశారు. విద్యార్థులను క్రీడల వైపు ప్రోత్సహిస్తూ తీర్చిదిద్దుతున్న ఫిజికల్ డైరెక్టర్ కె. సన్నీ డేనియల్ సేవలను వారు అభినందించారు. చదువుతో పాటు క్రీడల్లోనూ విద్యార్థులు రాణించేందుకు కళాశాల యాజమాన్యం ఎల్లప్పుడూ అవసరమైన శిక్షణ, పూర్తి ప్రోత్సాహాన్ని అందిస్తుందని పేర్కొన్నారు.
అలాగే కళాశాల అధ్యాపక బృందం (Faculty) కూడా ఎంపికైన విద్యార్థినులకు అభినందనలు తెలుపుతూ, జిల్లా స్థాయి పోటీల్లో విజయం సాధించి ఎం.ఏ.ఎం ఫార్మసీ కళాశాలకు మరిన్ని ట్రోఫీలు తీసుకురావాలని ఆకాంక్షించింది.
