దాని కోసం నా డాగ్ ని వాడతానంటున్న కుస్తీ భామ..!
Aishwwarya lekshmi: నేను బయటి ప్రపంచంలో ఏం జరుగుతుందో, వార్తలు, సినిమా అప్‌డేట్స్ ఏంటో తెలుసుకోవడానికి నా డాగ్ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను మాత్రమే వాడుతుంటాను” అని నటి ఐశ్వర్య లక్ష్మి (Aishwarya Lekshmi ) ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. సోషల్ మీడియాలో తనకు ఎప్పుడూ రక్షణ ఉన్నట్లు అనిపించలేదని, అసలు సోషల్ మీడియాలోకి తిరిగి రావాలనే ఆలోచనే లేదని స్పష్టం చేశారు. రోజుకు రూ.100 కోట్లు ఇస్తామన్నా ఆ దరిదాపుల్లోకి కూడా వెళ్లనని చెప్పారు. గతంలో తన ఫొటోలను మార్ఫ్ చేయడం, నెగెటివ్ కామెంట్లు పెట్టడం వల్ల అందరూ తనను ద్వేషిస్తున్నారేమోనని భయం వేసేదని, ప్రస్తుతం డిజిటల్ ఒత్తిడి లేకుండా నేరుగా ప్రజలను కలవడం ఎంతో సంతోషాన్ని ఇస్తోందని పేర్కొన్నారు.
ప్రస్తుతం ‘గట్టా కుస్తీ 2’ (Gatta Kusthi -2) సినిమా విజయాన్ని ఆస్వాదిస్తున్న ఐశ్వర్య.. బాక్సాఫీస్ కలెక్షన్ల కంటే థియేటర్లలో ప్రేక్షకులు నవ్వుతూ సినిమాను చూడడమే తనకు అసలైన సంతృప్తిని ఇస్తుందన్నారు. ఈ చిత్రం వినోదంతో పాటు స్త్రీ, పురుష సమానత్వాన్ని చూపిస్తుందని, ఒక మహిళ తన కలలను సాకారం చేసుకోవడంలో పురుషుడి పాత్ర ఎంత ముఖ్యమో ప్రియాంక చోప్రా ( Priyanka Chopra )-నిక్ జోనస్ ( Nick Jonus ) జంటను ఉదాహరణగా చెప్తూ విశ్లేషించారు. తనకు సినిమాలో కామెడీ సన్నివేశాలు చేయడం ఇష్టమని, అయితే కామెడీ పండించడంలో తాను ఇంకా మెరుగుపడాల్సి ఉందన్నారు.
కెరీర్ విషయానికి వస్తే, ఐశ్వర్య లక్ష్మి ప్రస్తుతం వరుస ప్రాజెక్ట్‌లతో ఎంతో బిజీగా ఉన్నారు. ఐశ్వర్య ఆనంద్ దర్శకత్వంలో వస్తున్న లేడీ ఓరియంటెడ్ తమిళ చిత్రంలో ఆమె పోలీస్ ఆఫీసర్‌గా కనిపిస్తున్నారు. వీటితో పాటు ‘తీవినయ్ పొట్రు’, ‘లవ్’ అనే రెండు వెబ్ సిరీస్‌లలో నటిస్తున్నారు. త్వరలోనే బాలీవుడ్‌లోకి కూడా ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు సమాచారం రాగా, దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో రానుంది.
