Telangana: మహబూబాబాద్ పట్టణ పరిధిలోని భవానీ నగర్ తండాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. మద్యం మత్తులో ఇంట్లో జరిగిన ఘర్షణ చివరకు ఒకరి ప్రాణాలను బలిగొంది. కన్న తండ్రినే కుమారుడు, భార్య కలిసి కర్రలతో కొట్టి దారుణంగా హత్య చేసిన సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
పోలీసులు మరియు స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం… భవానీ నగర్ తండాకు చెందిన పసందుల చంద్రయ్య (50) రాత్రి వేళ తన ఇంట్లో మరో ఇద్దరితో కలిసి మద్యం సేవించాడు. అర్ధరాత్రి దాటాక తీవ్రమైన మద్యం మత్తులో ఉన్న చంద్రయ్య, తన భార్య విజయలక్ష్మితో గొడవపడి ఆమెపై దాడికి దిగాడు. తల్లిని కొడుతుండటాన్ని గమనించిన కుమారుడు వీరాచారి వెంటనే అడ్డుకున్నాడు.
ఈ క్రమంలో ఇంట్లో మాటమాట పెరిగి ఘర్షణ తీవ్రరూపం దాల్చింది. మద్యం మత్తులో ఉన్న చంద్రయ్యను అదుపు చేసే క్రమంలో భార్య విజయలక్ష్మి, కుమారుడు వీరాచారి కలిసి తీవ్ర ఆగ్రహంతో కర్రతో చంద్రయ్యపై దాడి చేశారు. తలపై తీవ్ర గాయాలు కావడంతో చంద్రయ్య అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.
ఘటన జరిగిన అనంతరం బాధితుడి కూతురు స్రవంతి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. సమాచారం అందుకున్న సి.ఐ రఘుపతి రెడ్డి తన సిబ్బందితో కలిసి వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. క్లూస్ టీమ్ సహాయంతో ఆధారాలు సేకరించి, చంద్రయ్య మృతదేహాన్ని పంచనామా అనంతరం పోస్టుమార్టం నిమిత్తం మహబూబాబాద్ ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని తదుపరి దర్యాప్తు జరుపుతున్నారు.