Ramayana Trailer: రామాయణం..అందరికీ తెలిసిన కథ. కానీ అందులో హనుమంతుడు లేకపోతే. అసలు ఆ ఊహ కూడా చేయలేము. కానీ నితీష్ తివారీ ( Nitesh Tiwari ) మాత్రం ఆ విషయాన్ని మర్చిపోయినట్టున్నాడు. హనుమంతుడు కనిపించకుండా.. రామాయణ ట్రైలర్ రిలీజ్ చేశాడు.
నమిత్ మల్హోత్రా ( Namit Malhotra )నిర్మాణంలో, నితేష్ తివారీ దర్శకత్వంలో అత్యంత భారీ బడ్జెట్‌తో రూపుదిద్దుకుంటున్న దృశ్య కావ్య చిత్రం ‘రామాయణం’. తాజాగా విడుదలైన ఈ సినిమా ట్రైలర్ నెట్టింట విపరీతమైన సంచలనం సృష్టిస్తోంది. మైండ్ బ్లోయింగ్ విజువల్స్, అద్భుతమైన గ్రాఫిక్స్, నటీనటుల గెటప్‌లతో ట్రైలర్ ప్రేక్షకులను ఒక కొత్త లోకంలోకి తీసుకెళ్లింది. అయితే, ట్రైలర్ ముగిసిన తర్వాత ప్రతి ఒక్కరి మనసులో మెదిలిన ఒకే ఒక్క ప్రధాన ప్రశ్న “హనుమంతుడెక్కడ..?”. అసలు హనుమంతుడు లేని రామాయణాన్ని ఊహించగలమా? ట్రైలర్ ఎంత గ్రాండ్‌గా ఉన్నా, రామకథలో అత్యంత కీలకమైన ఆ పాత్ర కనిపించకపోవడం అభిమానుల్లో తీవ్ర నిరాశను మిగిల్చింది.
ట్రైలర్ పరంగా చూస్తే ప్రొడక్షన్ వాల్యూస్, విజువల్ ఎఫెక్ట్స్ (VFX) హాలీవుడ్ స్థాయిలో ఉన్నాయి. టీమ్ గ్రాఫిక్స్ మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టినట్టు ప్రతి ఫ్రేమ్‌లోనూ స్పష్టంగా కనిపిస్తోంది. శ్రీరాముడి పాత్రలో రణ్‌బీర్ కపూర్ ( Ranbir Kapoor ) లుక్ ప్రశాంతంగా, రాజసంగా ఉండి ఆకట్టుకోగా, సీతగా సాయిపల్లవి ( Sai Pallavi ) తనదైన ప్రశాంతతను పంచింది. ఇక శూర్పణఖగా రకుల్ ప్రీత్ సింగ్ ( Rakul Preeth Singh ), కుంభకర్ణుడి గెటప్‌లు బాగా కుదిరాయి. ప్రత్యేకించి జటాయువుకు సంబంధించిన విజువల్స్ ట్రైలర్‌కే మైలురాయిగా నిలిచాయి.
ఈ ట్రైలర్‌కే ప్రధాన ఆకర్షణగా నిలిచింది మాత్రం రావణాసురుడిగా నటించిన కేజీఎఫ్ స్టార్ యష్. ( Yash ) తన స్క్రీన్ ప్రెజెన్స్, రాయల్ లుక్, భయంకరమైన రాక్షసత్వంతో యష్ ట్రైలర్‌ను మరో స్థాయికి తీసుకెళ్లాడు. అయితే, హిందీ వర్షన్ ట్రైలర్‌లో యష్‌కి ఇచ్చిన డబ్బింగ్ గొంతు మాత్రం అతని పవర్‌ఫుల్ యాక్టింగ్, స్క్రీన్ ప్రెజెన్స్‌కు సరిగ్గా సెట్ కాలేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అతని గంభీరమైన లుక్‌కు ఆ వాయిస్ సరిపోకపోవడం కొంత మైనస్‌గా అనిపిస్తుంది.
ట్రైలర్ విజువల్ రిచ్‌గా ఉన్నప్పటికీ కొన్ని ప్రధాన నిరాశపరిచే అంశాలు కూడా ఉన్నాయి. రామాయణంలో అత్యంత ప్రియమైన హనుమంతుడి పాత్రను ఒక్క ఫ్రేమ్‌లో కూడా చూపించకపోవడం పెద్ద లోటుగా కనిపిస్తోంది. సన్నీ డియోల్ ( Sunny Deol )ఈ పాత్ర పోషిస్తున్నాడని ప్రచారం ఉన్నప్పటికీ, అతడి లుక్ రివీల్ చేయకపోవడం నిరాశపరిచింది. అలాగే మండోదరిగా నటిస్తున్న కాజల్ అగర్వాల్ ( Kajal Agarwal ) కూడా ట్రైలర్‌లో ఎక్కడా కనిపించలేదు. దీనికి తోడు కొన్ని చోట్ల విజువల్ ఎఫెక్ట్స్‌పై ఎక్కువ దృష్టి పెట్టడం వల్ల కథలోని సహజమైన ఎమోషన్ కంటే గ్రాఫిక్సే ఎక్కువైపోయాయా అనే సందేహం కలుగుతోంది.
మొత్తానికి నమిత్ మల్హోత్రా ‘రామాయణం’ ట్రైలర్ సాంకేతికంగా, విజువల్స్ పరంగా అత్యున్నత ప్రమాణాలతో ఉండి సినిమాపై అంచనాలను విపరీతంగా పెంచేసింది. యష్ విశ్వరూపం, రణ్‌బీర్ లుక్ సినిమాపై ఆసక్తిని రేకెత్తిస్తున్నప్పటికీ, “హనుమంతుడు లేని రామాయణమా?” అని బాధపడుతున్న అభిమానుల నిరాశను తొలగించాలంటే మేకర్స్ త్వరలోనే హనుమంతుడి పాత్రకు సంబంధించిన అప్‌డేట్ ఇవ్వాల్సిందే.
Aishwarya Lekshmi: దాని కోసం నా డాగ్ ని వాడతానంటున్న కుస్తీ భామ..!