NEET Paper Leak Crisis: బీజేపీ గ్రాఫ్ పడిపోతోందా…?

NEET Paper Leak Crisis: A Warning Bell for BJP after 12 Years in Power?

NEET Paper Leak Crisis: దేశ రాజకీయాల్లో ఇప్పుడు ఒకటే చర్చ సాగుతోంది.. అదే “బీజేపీ (bjp) గ్రాఫ్ క్రమంగా పడిపోతోందా?” అని. 2012లో యూపీఏ ప్రభుత్వ హయాంలో జరిగిన నిర్భయ (Nirbhaya) ఆందోళనలు ఆనాటి కాంగ్రెస్ సర్కారు పునాదులను కదిలించి, 2014లో అధికార మార్పిడికి ఏ విధంగా నాంది పలికాయో, నేడు నీట్ (NEET) పేపర్ లీకేజీ ఆందోళనలు కూడా కమలనాథులకు అటువంటి ప్రతికూల పరిస్థితులను తెచ్చిపెడుతున్నాయా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుతో ముడిపడి ఉన్న ఈ వ్యవహారం జంతర్ మంతర్ నుంచి దేశమంతటా వీధుల దాకా వ్యాపించడంతో, కేంద్ర ప్రభుత్వానికి ఇది పెద్ద తలనొప్పిగా మారింది.

సమస్య తీవ్రతను ప్రారంభంలోనే గుర్తించి నష్ట నివారణ చర్యలు చేపట్టడంలో కేంద్ర ప్రభుత్వం, విద్యా మంత్రిత్వ శాఖ తీవ్రంగా విఫలమయ్యాయనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. మొదట లీకేజీని ఖండించడం, ఆ తర్వాత అక్రమాలు జరిగాయని అంగీకరించడం వంటి పరస్పర విరుద్ధ ప్రకటనలు ప్రభుత్వ విశ్వసనీయతను దెబ్బతీశాయి. ప్రతిపక్షాలు, విద్యార్థి సంఘాలు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాను గట్టిగా డిమాండ్ చేస్తున్నప్పటికీ, ఆయన చేత రాజీనామా చేయించకపోవడం ప్రభుత్వ పట్టుదలకు, లేదా పాలకుల అగ్రనేతల ‘ఈగో’కి నిదర్శనమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

నరేంద్ర మోదీ ప్రధాని పీఠం ఎక్కి సుదీర్ఘ కాలం పూర్తవుతున్న వేళ, ఏ ప్రభుత్వానికైనా సహజంగా వచ్చే ‘యాంటీ ఇన్‌కంబెన్సీ’ (ప్రభుత్వ వ్యతిరేకత) ప్రభావం ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తోంది. నిరుద్యోగం, పేపర్ లీకేజీల వల్ల పెల్లుబుకుతున్న యువత అసంతృప్తిని ముందే పసిగట్టి, సర్దుబాటు ధోరణితో నడుచుకోవాల్సిన ప్రభుత్వం కఠిన వైఖరి ప్రదర్శించడం రాజకీయంగా ముప్పుగా మారుతోంది. ఈ అంశాన్ని కేవలం ప్రతిపక్షాల కుట్రగా చిత్రీకరించే ప్రయత్నం చేయడం కంటే, బాధిత విద్యార్థులకు త్వరితగతిన పూర్తిస్థాయి న్యాయం చేయడంలో కాలయాపన చేయడం సర్కారు ఇమేజ్‌ను బాగా దిగజార్చింది.

మరోవైపు, ఈ పరిణామాలు ప్రతిపక్ష కాంగ్రెస్‌కు, ముఖ్యంగా రాహుల్ గాంధీకి సరికొత్త రాజకీయ ఊపిరి ఊదుతున్నాయి. స్వయంగా బాధితులైన విద్యార్థులను కలవడం, పార్లమెంటుతో పాటు వీధుల్లోనూ నీట్ అంశంపై పోరాడటం ద్వారా రాహుల్ గాంధీ యువతలో తన స్థానాన్ని బలపరుచుకునే ప్రయత్నం చేస్తున్నారు. ‘యువత కాంగ్రెస్‌కు దూరమైంది’ అన్న ముద్రను చెరిపేసి, రాబోయే రోజుల్లో దేశవ్యాప్త యువతకు ప్రధాన నాయకుడిగా ఎదిగేందుకు ఈ పరిస్థితిని కాంగ్రెస్ ఎంతవరకు క్యాష్ చేసుకుంటుందో వేచి చూడాలి. ఏది ఏమైనా, ప్రజాస్వామ్యంలో ప్రజల, ముఖ్యంగా యువత ఆగ్రహాన్ని గమనించి దిద్దుబాటు చర్యలు తీసుకోకపోతే.. గతంలో కాంగ్రెస్‌కు పట్టిన గతే భవిష్యత్తులో బీజేపీకి పునరావృతమయ్యే ప్రమాదం లేకపోలేదు.

Related posts

భూమి మీద దోమలు అంతరించిపోతాయా..?

Arunachalam: అరుణాచలంలో అరవ గోల.. తెలుగువాళ్లంటే అంత చులకనా..?

Flipkart: ఫ్లిప్‌కార్ట్ ఫ్రీడమ్ సేల్ వచ్చేస్తోంది.. డీల్స్ వేరే లెవెల్!