ప్రధాని మోదీ చేతుల మీదుగా చారిత్రక ఘట్టం
ఉత్తరాంధ్రకు మణిహారంగా కొత్త విమానాశ్రయం
రాష్ట్ర చరిత్రలో నిలిచేలా ప్రారంభోత్సవ వేడుకలు
ఉత్తరాంధ్ర ప్రగతి ఇక అన్ స్టాపబుల్
భోగాపురం విమానశ్రయంపై సమీక్షలో సీఎం చంద్రబాబు
భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ ఉత్తరాంధ్రకు మణిహారంగా మారుతుందని, ఈ కొత్త విమానాశ్రయం ఆ ప్రాంత స్థితిగతులను పూర్తిగా మార్చేస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. భోగాపురం విమానాశ్రయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఆగస్టు 1వ తేదీన ప్రారంభించేందుకు షెడ్యూల్ ఖరారైనట్లు ఆయన వెల్లడించారు. 2014లో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో మొదలైన ఈ పనులను ప్రస్తుత కూటమి ప్రభుత్వం అత్యంత వేగవంతం చేసి కేవలం 2 ఏళ్ల కాలంలో పూర్తి చేసిందని ఆయన స్పష్టం చేశారు. సర్వాంగ సుందరంగా ముస్తాబైన భోగాపురం విమానాశ్రయ ప్రారంభోత్సవాన్ని అత్యంత ఘనంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఉన్నత స్థాయి అధికారులతో సమీక్ష
ఈ ప్రారంభ కార్యక్రమంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్, డీజీపీ హరీష్ కుమార్ గుప్తాతో పాటు మంత్రులు సత్యకుమార్, అచ్చెన్నాయుడు, అనిత మరియు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఏవియేషన్ శాఖ అధికారులు, నిర్మాణ బాధ్యతలు చేపట్టిన జిఎంఆర్ సంస్థ ప్రతినిధులు విమానాశ్రయంలోని వసతులు, సౌకర్యాల గురించి ముఖ్యమంత్రికి వివరించారు. విమానాశ్రయ కార్యకలాపాలు ప్రారంభించడానికి అవసరమైన 8 కీలక అనుమతులు ఇప్పటికే సాధించినట్లు అధికారులు ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
ఉత్తరాంధ్ర ఇక అన్ స్టాపబుల్
ఈ ఉన్నత స్థాయి సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ఉత్తరాంధ్ర అభివృద్ధిలో భోగాపురం విమానాశ్రయం అత్యంత కీలక పాత్ర పోషించనుందని ధీమా వ్యక్తం చేశారు. సామాన్యుల జీవితాలను మార్చే విధంగా ఈ విమానాశ్రయం కొత్త అవకాశాలను సృష్టిస్తుందని, తద్వారా ఆ ప్రాంతంలో ఎకనమిక్ యాక్టివిటీ ఉరుకులు పెడుతుందని ఆయన అంచనా వేశారు. రాకపోకలు మొదలయ్యాక ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడటమే కాకుండా, టూరిజం, పారిశ్రామిక రంగాల్లో విశాఖ ఎకనమిక్ రీజియన్ శరవేగంగా అభివృద్ధి చెందుతుందని వివరించారు. హైదరాబాద్ నగరంలో శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ ఎలాంటి గొప్ప మార్పులు తీసుకువచ్చిందో, భోగాపురం విమానాశ్రయం కూడా ఉత్తరాంధ్రలో అటువంటి విప్లవాత్మక మార్పులు తెస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. సాగునీటి ప్రాజెక్టులు, హైవేలు, పోర్టులు, విమానాశ్రయాలతో ఉత్తరాంధ్ర అభివృద్ధి కొత్త పుంతలు తొక్కుతుందని, రానున్న రోజుల్లో ఉత్తరాంధ్ర అన్ స్టాపబుల్ అని ముఖ్యమంత్రి ఉద్ఘాటించారు.
ప్రతి ఒక్కరూ గర్వించేలా వేడుకలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సంస్కృతి, సంప్రదాయాలు, కళలను చాటేలా విమానాశ్రయంలోని ప్రతి విభాగాన్ని అత్యంత కళాత్మకంగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. ప్రధానమంత్రి చేతుల మీదుగా జరిగే ఈ ప్రారంభోత్సవం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయేలా ఉండాలని ఆయన ఆకాంక్షించారు. ముఖ్యంగా గిరిజన సంస్కృతి, హస్తకళలను ప్రతిబింబించేలా స్వాగత కార్యక్రమాలు ప్లాన్ చేయాలని సూచించారు. భోగాపురం విమానాశ్రయం ప్రారంభోత్సవం ఉత్తరాంధ్రలోని ప్రతి కుటుంబం, ప్రతి పౌరుడు పండుగలా జరుపుకోవాల్సిన శుభ సందర్భమని ఆయన అభివర్ణించారు. ప్రతి పౌరుడూ ఈ కట్టడాన్ని చూసి గర్వించే పరిస్థితి రావాలని, ఈ చారిత్రక ఘట్టంలో స్థానిక ప్రజలను, విద్యార్థులను, యువతను భాగస్వాములను చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
