ఆడవాళ్ల అరాచకాలపై ఏకమ్ న్యాయ్ నివేదిక సంచలనం!
భార్య అంటే ఒకప్పుడు అనురాగం.. ఇప్పుడదే భార్య అంటే ఒక నిలువెత్తు భయం! సమాజంలో మగాడిపై సాగుతున్న నిశ్శబ్ద అరాచకాలకు, ఇంటి నాలుగు గోడల మధ్య నలిగిపోతున్న భర్తల ఆర్తనాదాలకు అద్దం పడుతోంది తాజా రిపోర్ట్.
గురుగ్రామ్‌కు చెందిన ‘ఏకం న్యాయ్ ఫౌండేషన్’ 2026 తొలి అర్ధభాగంలో (జనవరి 1 నుండి జూలై 14 వరకు) దేశవ్యాప్తంగా జరిగిన ఘోరాలపై ఒక సంచలన నివేదికను విడుదల చేసింది. ఈ రిపోర్ట్ చూస్తే ఏ మగాడైనా వణికిపోవాల్సిందే. కేవలం ఆరు నెలల కాలంలోనే ఏకంగా 554 మంది భర్తలు దారుణ హత్యలకు గురవడం లేదా భార్యల వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్యలకు పాల్పడడం దేశాన్ని ఉలిక్కిపడేలా చేస్తోంది.
అక్రమ సంబంధాల ఆట.. భర్తల వేట
సినిమా స్క్రిప్ట్‌లను మించిన విలనిజం ఈ నివేదికలోని హత్యల్లో కనిపిస్తోంది. నమోదైన 322 భర్తల హత్యల కేసుల్లో ఏకంగా 194 కేసులు (60.2 శాతం) కేవలం వివాహేతర సంబంధాల వల్లే జరిగాయి. కట్టుకున్న భర్త కళ్లముందే భార్యలు అక్రమ సంబంధాలు పెట్టుకోవడం, దాన్ని భర్త ప్రశ్నిస్తే చాలు.. ప్రియుడితో కలిసి స్కెచ్ వేసి మరీ ప్రాణాలు తీయడం నిత్యకృత్యమైంది. 88 హత్యలు నిత్యం ఇంట్లో జరిగే గృహ తగాదాల వల్లే జరిగాయి.
ఈ హత్యల పద్ధతులు వింటుంటేనే ఒళ్లు గగుర్పొడుస్తుంది. తలలు నరకడం, ముక్కలుగా కోసేయడం, విష ప్రయోగం చేయడం, ఇంటి నేల కిందే పాతిపెట్టడం, పెట్రోల్ పోసి సజీవ దహనం చేయడం, లోతైన లోయల్లోకి తోసేయడం వంటి భయంకరమైన మార్గాల్లో భార్యలు తమ క్రూరత్వాన్ని ప్రదర్శించారు. కేతన్ అగర్వాల్ అనే వ్యక్తిని అతని కాబోయే భార్య సియా గోయల్, ఆమె ప్రియుడు చేతన్ కలిసి లోయలోకి తోసి చంపిన ఘోరమే దీనికి ప్రత్యక్ష నిదర్శనం.
మానసిక నరకం.. బలవన్మరణాలు!
ఇక చంపకుండా ఇంట్లోనే నరకం చూపిస్తూ ఆత్మహత్యలకు పురికొల్పుతున్న ఘటనలు మరికొన్ని. ఈ ఆరు నెలల్లో 232 మంది భర్తలు భార్యల వేధింపులు భరించలేక బలవన్మరణానికి శరణుజొచ్చారు. ఇందులో 104 కేసులు దీర్ఘకాలిక వైవాహిక కలహాల వల్ల జరిగితే, 57 కేసులు భార్యలు, అత్తమామల నిరంతర వేధింపుల వల్ల జరిగాయి. భార్యలు పెట్టే తప్పుడు క్రిమినల్ కేసులు, సమాజంలో చేసే అవమానాలు, కన్న పిల్లలను కలుసుకోనివ్వకుండా చేసే మానసిక క్రూరత్వం భరించలేక ఎంతో మంది భర్తలు సెల్ఫీ వీడియోలు రికార్డ్ చేస్తూ, కన్నీటితో సూసైడ్ నోట్లు రాసి ప్రాణాలు వదిలేశారు.
రోజుకు ఇద్దరు భర్తల హత్య!
ఈ గణాంకాల ప్రకారం.. భారతదేశంలో ప్రతిరోజూ సగటున ఇద్దరు భర్తలు భార్యల చేతిలో హత్యకు గురవుతుండగా, ఒకరి కంటే ఎక్కువ మంది భర్తలు ఆత్మహత్య చేసుకుంటున్నారు. దేశవ్యాప్తంగా ఉత్తరప్రదేశ్ 196 కేసులతో (93 హత్యలు, 103 ఆత్మహత్యలు) అగ్రస్థానంలో ఉండగా, మధ్యప్రదేశ్, రాజస్థాన్, తెలంగాణ, మహారాష్ట్ర, హర్యానా, బీహార్, కర్ణాటక, గుజరాత్ రాష్ట్రాల్లోనూ ఈ అరాచకాలు విపరీతంగా పెరిగిపోయాయి.
నిశ్శబ్ద బాధితులు.. మగవారికి చట్టాలెక్కడ?
ఏకం న్యాయ్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు దీపిక నారాయణ్ భార్గవ్ ఆవేదన వ్యక్తం చేస్తూ.. ఇవి కేవలం మీడియా దృష్టికి వచ్చిన కేసులు మాత్రమేనని, వెలుగులోకి రాని అసలు అరాచకాలు ఇంకా ఎన్నో రెట్లు ఎక్కువగా ఉంటాయని పేర్కొన్నారు. నేర గణాంకాలను నమోదు చేసే ప్రభుత్వ అధికారిక జాతీయ డేటాబేస్ (NCRB) లో పురుషులపై జరిగే గృహ హింసను లేదా భర్తల హత్యలను ట్రాక్ చేయడానికి ప్రత్యేక వర్గీకరణే లేకపోవడం పెద్ద సవాలుగా మారిందని ఆమె స్పష్టం చేశారు. భార్యల క్రూరత్వానికి బలవుతున్న భర్తలను కాపాడటానికి, పురుషుల హక్కుల కోసం కూడా కఠినమైన చట్టాలు రావాల్సిన సమయం ఆసన్నమైందని ఈ సంచలన నివేదిక హెచ్చరిస్తోంది.
ఇది చదివారా..? ఆంధ్ర – తెలంగాణ అపూర్వ బంధం రోదసిని జయించింది
