Ganesh Chaturthi 2026: వినాయక చవితి ఉత్సవాలంటేనే ఒక ప్రత్యేకమైన సాంస్కృతిక వైభవం. అందులో హైదరాబాద్ లో అయితే ఆ సెలబ్రేషన్స్ ఊహించడమే కష్టం. ఈ ఏడాది ఉత్సవాలకు సంబంధించి భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి తీసుకున్న నిర్ణయం నిజంగా అభినందనీయం, స్వాగతించదగ్గ పరిణామం.
బంకించంద్ర చటోపాధ్యాయ రచించిన ‘వందేమాతరం’ (Vandemataram) గీతం 150 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా.. సెప్టెంబర్ 17న తెలంగాణవ్యాప్తంగా ఉన్న అన్ని గణేశ్ మండపాల వద్ద జాతీయ జెండాను (Nationa Flag) ఆవిష్కరించి, వందేమాతరం గీతాలాపన చేయాలని సమితి పిలుపునిచ్చింది. సనాతన ధర్మం (sanathan Dharmam)పై నేటి యువతకు అవగాహన కల్పించడం, కుల వివక్షను రూపుమాపి హిందూ ఐక్యతను బలోపేతం చేయడం, సంత్ రవిదాస్ జయంతి వేడుకలను నిర్వహించడం వంటి అంశాలను ఈసారి ప్రధాన ఎజెండాగా పెట్టారు. సెప్టెంబర్ 14న ప్రారంభం కానున్న ఈ ఉత్సవాల్లో హైదరాబాద్ ఖైరతాబాద్ గణేశుడు (Khairatabad Ganesh) ఈసారి 69 అడుగుల ఎత్తులో ‘పంచముఖ సంకటహర మహా గణపతి’గా భక్తులకు దర్శనమివ్వనున్నారు.
అయితే, ఇక్కడే మనం ఒక చేదు నిజం మాట్లాడుకోవాలి. నేటి ‘జెన్ జీ’ (Gen Z) తరానికి వినాయక చవితి అనేది ఒక భక్తి పండుగలా కాకుండా, కేవలం భారీ ఖర్చులతో కూడిన ఒక హంగామాగా మారిపోతోందా అనే అనుమానం కలుగుతోంది. ఉత్సవ సమితి ఆశయం ఎంత గొప్పదైనా, క్షేత్రస్థాయిలో మండపాల వద్ద జరుగుతున్న రాద్ధాంతం ఆ ఆశయానికే గండి కొడుతోంది. వినాయకుడి సన్నిధిలో ఆధ్యాత్మిక వాతావరణం ఉండాల్సింది పోయి, అర్థం పర్థం లేని సినిమా పాటలు, ఐటెం సాంగ్స్, గుండెలు పగిలిపోయేలా చేసే డీజేల హోరు ఎక్కువైపోయింది. ఇక నిమజ్జనం రోజున భక్తి శ్రద్ధల కంటే మద్యం ఏరులై పారడం, నడిరోడ్డుపై యువత న్యూసెన్స్ చేయడం చూస్తుంటే అసలు మనం ఏ సంస్కృతిని భవిష్యత్తు తరాలకు అందిస్తున్నామనే ఆందోళన కలుగుతోంది. ఈ శబ్ద కాలుష్యాన్ని, మద్యం హోరును అదుపు చేయనంత కాలం సమితి ఆశించిన నిజమైన దేశభక్తి, దైవభక్తి యువతలో పెంపొందడం అసాధ్యం.
ఈ అపసవ్య ధోరణి మారాలంటే అటు ప్రభుత్వాలు, ఇటు ప్రజలు కూడా బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన అత్యవసర సమయం ఇది. ముందుగా ప్రభుత్వం (telangana Government), పోలీసులు (Police) కేవలం కాగితాలకే పరిమితం కాకుండా కఠినమైన నిబంధనలు అమలు చేయాలి. మండపాల్లో శబ్ద కాలుష్య పరిమితి దాటి డీజేలు పెడితే వెంటనే అనుమతులు రద్దు చేసేలా కఠినంగా వ్యవహరించాలి. అలాగే నిమజ్జనం జరిగే మార్గాల్లో వైన్ షాపులను పూర్తిగా మూసివేయడమే కాకుండా, బహిరంగంగా మద్యం సేవించే వారిపై భారీ జరిమానాలు విధించాలి.
మరోవైపు, ఉత్సవ నిర్వాహకులు, ప్రజలు కూడా కేవలం ‘షో ఆఫ్’ కోసం కాకుండా పండుగ వెనుక ఉన్న పారమార్థిక విలువలను గౌరవించాలి. డీజే సంస్కృతికి స్వస్తి చెప్పి సాంప్రదాయ డ్రమ్స్, నిత్య భజనలు, ఆధ్యాత్మిక వైబ్స్ ఉండేలా చూసుకోవాలి. చందాల వసూళ్ల హడావిడి తగ్గించి, స్థానిక యువతకు సనాతన ధర్మం మరియు దేశభక్తిపై వ్యాస రచన, క్విజ్ వంటి పోటీలు నిర్వహించాలి. పండుగను కమర్షియల్ హంగామాగా మార్చకుండా, ఒక పవిత్రమైన ఆధ్యాత్మిక ఉత్సవంగా జరుపుకున్నప్పుడే సనాతన ధర్మానికి, మనం జరుపుకునే పండుగలకు అసలైన సార్థకత చేకూరుతుంది.
