లారీ ఓనర్ల సమస్యలపై సానుకూలంగా స్పందించిన మంత్రి మండిపల్లి

Lorry Owners Met Minister Mandipalli Ram prasad Reddy

శ్రీకాకుళం ఇసుక రీచ్‌లలో జరుగుతున్న ఓవర్‌లోడింగ్, ఫేక్ బిల్లుల దందాపై క్వారీ లారీ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ భగ్గుమంది. ఈ సమస్యల వల్ల తాము పడుతున్న ఇబ్బందులను రాష్ట్ర రవాణా, యువజన, క్రీడాశాఖల మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి  (MandiPalli ramPrasad Reddy) దృష్టికి తీసుకెళ్లారు. విశాఖపట్నంలోని హోటల్ దాస్పల్లాలో మంత్రిని మర్యాదపూర్వకంగా కలిసిన అసోసియేషన్ ప్రతినిధులు.. తమ గోడును వినతిపత్రం రూపంలో అందజేశారు.

అసలు సమస్య ఏంటి?
శ్రీకాకుళం ఇసుక రీచ్‌లలో కొందరు ఇష్టారాజ్యంగా ఓవర్‌లోడింగ్‌కు పాల్పడటమే కాకుండా, తప్పుడు బిల్లులు (ఫేక్ బిల్లులు) జారీ చేస్తున్నారని లారీ యజమానులు ఆవేదన వ్యక్తం చేశారు. దీనివల్ల అటు ప్రజలు, ఇటు లారీ ఓనర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మంత్రికి వివరించారు. ముఖ్యంగా పరిమితికి మించి బరువు వేయడం వల్ల రోడ్డు భద్రతకు పెద్ద ముప్పుగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు.

ప్రాణాలు పోతున్నా.. ఇన్సూరెన్స్ దక్కని వైనం!
ఓవర్‌లోడింగ్ వల్ల జరిగే ప్రమాదాల్లో అత్యంత బాధాకరమైన విషయం ఇన్సూరెన్స్. ప్రమాదవశాత్తూ డ్రైవర్లు, క్లీనర్లు లేదా థర్డ్ పార్టీ వ్యక్తులు ప్రాణాలు కోల్పోయినా.. కనీసం వాహనం డ్యామేజ్ అయినా సరే, ‘ఓవర్‌లోడింగ్’ అనే కారణంతో ఇన్సూరెన్స్ కంపెనీలు పరిహారం ఇవ్వట్లేదని అసోసియేషన్ సభ్యులు వాపోయారు. ఈ విషయం తెలియక చాలామంది అమాయకులు అన్యాయానికి గురవుతున్నారని, దీనిపై వెంటనే అందరికీ అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని కోరారు. ప్రభుత్వ నిబంధనల మేరకే ఇసుక లోడింగ్ జరిగేలా కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

సానుకూలంగా స్పందించిన మంత్రి
లారీ యజమానులు చెప్పిన సమస్యలను మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఓపిగ్గా విన్నారు. వారి విజ్ఞప్తిపై ఆయన సానుకూలంగా స్పందించారు. ఈ ఓవర్‌లోడింగ్, ఫేక్ బిల్లుల సమస్యను వెంటనే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి, ప్రభుత్వ నిబంధనలు పక్కాగా అమలయ్యేలా తగిన చర్యలు తీసుకుంటామని ఆయన లారీ యజమానులకు హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో క్వారీ లారీ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు M.V. రమణ, కార్యదర్శి B. సురేష్‌తో పాటు పలువురు అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.

Related posts

విజయవాడ కార్పొరేషన్ లో కూటమిదే విజయం: మంత్రి కందుల దుర్గేష్

Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టుకు పర్యావరణహిత PM ఈ-బస్సులు

Mega PTM: పేదలకు బడిని దూరం కానివ్వం: హోంమంత్రి అనిత