New Delhi: తెలుగుదేశం పార్టీ (టీడీపీ) పార్లమెంటు సభ్యుల బృందం మంగళవారం భారత ఉపరాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్‌ను మర్యాదపూర్వకంగా కలిసింది. ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు నాయకత్వంలో వెళ్లిన ఈ ప్రతినిధి బృందం, అమరావతి రాజధాని చరిత్ర మరియు ప్రాముఖ్యతను వివరిస్తూ రూపొందించిన “Amaravati: Built by the People, Secured by Destiny” అనే పుస్తకాన్ని ఉపరాష్ట్రపతికి అందజేసింది.
అమరజీవి పొట్టి శ్రీరాములు త్యాగాల స్ఫూర్తి నుంచి రాజధాని అమరావతి పరిరక్షణ కోసం రైతులు, మహిళలు సుదీర్ఘంగా 1,631 రోజుల పాటు సాగించిన పోరాట పరిణామాలను ఈ పుస్తకంలో వివరంగా పొందుపరిచారు. అలాగే 2024 జూన్ 2 నుంచి అమరావతిని ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా పునరుద్ధరించిన చారిత్రక ఘట్టాలను ఇందులో పొందుపరిచినట్లు ఎంపీలు వివరించారు.
ఈ సందర్భంగా ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దూరదృష్టితో కూడిన నాయకత్వం, కేంద్ర ఎన్డీఏ ప్రభుత్వ పూర్తి మద్దతుతో అమరావతిని ప్రపంచ స్థాయి రాజధానిగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోందని స్పష్టం చేశారు.