మగువా.. మగువా.. లోకానికి తెలుసా నీ విలువా..

The Pictures That Tell the Story of a Changing India

ఈ రెండు ఫొటోలు చూస్తుంటే గుండెల్లో ఏదో తెలియని అలజడి, ఒకలాంటి ఆవేశం ఉప్పొంగుతున్నాయి. ఇవి కేవలం సోషల్ మీడియాలో కనిపించిన రెండు చిత్రాలు మాత్రమే కావు… ఈ సమాజం ఆడపిల్లల చుట్టూ గీసిన అసంఖ్యాకమైన గీతాలను, హద్దులను పటాపంచలు చేస్తూ నిలబడిన రెండు పవర్‌ఫుల్ విజువల్స్. ఢిల్లీలో నీట్ (NEET) పరీక్షల వివాదంపై విద్యార్థులు వీధుల్లోకి వచ్చి పోరాడుతున్నప్పుడు కెమెరా కంటికి చిక్కిన ఈ దృశ్యాలు ప్రతీ ఒక్కరినీ ఆలోచింపజేస్తున్నాయి. ఒక ఫొటోలో అంతులేని తెగువ కనిపిస్తే, మరొక ఫొటోలో సాటి మనుషులను కాపాడుకోవాలనే అపారమైన ప్రేమ, ఆరాటం ప్రస్పటంగా కనిపిస్తున్నాయి.

మొదటి ఫొటోలో ఒక యువతి ఏమాత్రం భయం లేకుండా భారీ పోలీసు వాహనానికి అడ్డంగా నిలబడిన తీరు చూస్తే ఎవరికైనా ఒళ్లు గగుర్పొడవాల్సిందే. చుట్టూ వందలాది మంది ఉన్నా, సిస్టమ్ యొక్క ప్రతిఘటనకు ఎదురొడ్డి ఒంటరిగా ఆ బస్సు ముందుకు వచ్చి నిలబడింది. “మా హక్కులను, మా భవిష్యత్తును కాలరాస్తుంటే చూస్తూ ఊరుకోవడానికి మేం చేతకాని వాళ్లం కాదు” అని ఆ యువతి  ధైర్యం బిగ్గరగా చాటిచెబుతోంది. భయం అన్న పదానికి అర్థమే తెలియదన్నట్టుగా, గజ్జెల తొడిగిన పాదాలే ఆపద వస్తే అడుగు ముందుకు వేసి హక్కుల కోసం పోరాడగలవని ఆ దృశ్యం నిరూపిస్తోంది.

ఇక రెండో ఫొటో చూస్తే ఆడపిల్లలోని ప్రేమ, రక్షణ తత్వం ఎంతటి శక్తివంతమైనవో అర్థమవుతుంది. పోలీసులు లాఠీలతో విద్యార్థులపైకి విరుచుకుపడుతుంటే, సాటి స్నేహితులకు ఆ దెబ్బలు తగలకుండా ఒక అమ్మాయి తన రెండు చేతులనూ గోడలా చాచి నిలబడింది. ఆ లాఠీ దెబ్బ తన శరీరంపై పడినా పర్లేదు కానీ, తన చుట్టూ ఉన్న తోటి విద్యార్థులకు ఏమీ కాకూడదనే ఆ ఆరాటంలో ఒక ‘అమ్మతనం’ కనిపిస్తోంది. ఆడపిల్లకి ప్రేమ పంచడమైనా, తన వాళ్ల కోసం రక్షణ కవచంలా మారడమైనా ఎవరూ ప్రత్యేకంగా నేర్పనక్కర్లేదు… అది ఆమె నరనరాల్లో, పుట్టుకతోనే వచ్చే ఆత్మగుణం.

పుట్టినప్పటి నుంచి ప్రతీ ఆడపిల్ల ఈ సమాజంలో రకరకాల ప్రశ్నలను, ఎత్తిపొడుపులను ఎదుర్కొంటూనే పెరుగుతుంది. “ఆడపిల్లవి నీకేం తెలుసు?”, “ఉన్నత చదువులు నీకెందుకు, చదువుకుని పెళ్లి చేసుకుని సర్దుకోక?”, “ఇంటి పని, వంట పని నేర్చుకుంటే చాలు”, “పెళ్లయ్యాక భర్త, అత్తమామలు ఒప్పుకుంటేనే ఉద్యోగం చెయ్యాలి”, “సాయంత్రం 7 దాటితే బయట నీకేం పని?” అని ప్రతి అడుగులోనూ వంకలు పెట్టే మనుషులకు ఈ రెండు ఫొటోలు చెంప చెళ్లుమనిపించే సమాధానాలు!

ఆడపిల్ల అంటే కేవలం నాలుగు గోడల మధ్య సర్దుకుపోయే అబల మాత్రమే కాదు. అవసరమైతే వ్యవస్థను ప్రశ్నించే ధైర్యం, తన వాళ్లకు ఆపద వస్తే లాఠీలకు ఎదురెళ్లే తెగువ ఆమె సొంతం. సమయాన్ని బట్టి శౌర్యాన్ని, అవసరాన్ని బట్టి అమాయకత్వాన్ని, ప్రేమను పంచడం ఒక్క మగువకే సాధ్యం.

మగువా.. మగువా.. లోకానికి తెలుసా నీ విలువా..

మగువా మగువా నీ సహనానికి సరిహద్దులు కలవా…!

Related posts

ఉదయం లేవగానే ఫోన్ చూస్తున్నారా? అసలు నిజం తెలిస్తే షాకవుతారు!

Ramayana Trailer: హనుమంతుడు లేని రామాయణమా..?

ప్రత్యక్ష రాజకీయాల్లోకి నారా భువనేశ్వరి..?