Andhra Pradesh: ఏపీలో బౌద్ధ క్షేత్రాల సమగ్ర అభివృద్ధికి, ‘బుద్ధిస్ట్ సర్క్యూట్’ ఏర్పాటుకు ప్రత్యేక కృషి చేస్తున్నామని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ (Kandula Durgesh) స్పష్టం చేశారు. తూర్పుగోదావరి జిల్లా ఉండ్రాజవరంలో రాష్ట్రంలోనే తొలిసారిగా నిర్మించిన ‘మైత్రేయ బుద్ధ విహార్’ (Maithreya Budha Vihar) ప్రారంభోత్సవంలో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొని గౌతమ బుద్ధుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా బౌద్ధ దమ్మ పీఠాధిపతి బంతె అనాలయో, శ్రీలంక నుంచి విచ్చేసిన డాక్టర్ బోధగామ చండిమా నాయకే థీరోల ఆశీస్సులు స్వీకరించిన మంత్రి, పలు దేశాల నుంచి వచ్చిన బౌద్ధ ప్రతినిధులతో ప్రత్యేకంగా మాట్లాడారు.
AP Minister Kandula Durgesh Announces Buddhist Circuit Plan
బుద్ధుడు సంచరించిన పవిత్ర ప్రాంతంగా నిడదవోలు (Nidadavolu) నియోజకవర్గంలోని ఉండ్రాజవరానికి ప్రత్యేక గుర్తింపు ఉందని మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan )ల దిశానిర్దేశంలో పర్యాటక శాఖను ప్రగతి పథంలో ముందుకు తీసుకెళ్తున్నామని పేర్కొన్నారు. యువత మరియు విద్యార్థుల్లో ఆధ్యాత్మిక, నైతిక విలువలను పెంపొందించేలా ఈ మైత్రేయ బుద్ధ విహార్ తోడ్పడాలని ఆయన ఆకాంక్షించారు. ఈ విహార్‌ను ప్రధాన పర్యాటక కేంద్రంగా మార్చి, విశ్వవ్యాప్తం చేసే దిశగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో చర్చించి తగిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.
ఉత్తర భారతదేశం తరహాలోనే ఆంధ్రప్రదేశ్‌లో కూడా ‘బుద్ధిస్ట్ సర్క్యూట్’ను ఏర్పాటు చేయాలని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌ను ఇప్పటికే కోరినట్లు మంత్రి దుర్గేష్ తెలిపారు. రాష్ట్రంలోని తొట్లకొండ, బావికొండ, ఆదుర్రు, ఉండ్రాజవరం, అమరావతి, నాగార్జునకొండ, ఘంటసాల వంటి ప్రముఖ బౌద్ధ క్షేత్రాలను అనుసంధానిస్తూ త్వరలోనే బుద్ధిస్ట్ సర్క్యూట్‌ను అందుబాటులోకి తెస్తామని ధీమా వ్యక్తం చేశారు.
శాంతి, సహనం, అహింస అనేవి ఏ కాలానికైనా ఆచరణీయమైనవని, ద్వేషాన్ని ప్రేమతోనే జయించగలమన్న బుద్ధుని సూక్తిని ప్రతి ఒక్కరూ పాటించాలని ఈ సందర్భంగా మంత్రి పిలుపునిచ్చారు. డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ వంటి ఎందరో మహానీయులు కూడా ఈ పవిత్ర మార్గాన్నే అనుసరించారని గుర్తుచేశారు. కాగా, ఆగస్ట్ 1వ తేదీన భోగాపురం ఎయిర్ పోర్ట్ ( Bhogapuram Airport ) ప్రారంభోత్సవ నేపథ్యంలో ప్రధాని పర్యటన ఉండటంతో సీఎం చంద్రబాబు నాయుడు ( Chandra babu Naidu ), డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లు ఈ కార్యక్రమానికి రాలేకపోయారని మంత్రి స్పష్టం చేశారు.