ఊటుకూరులో బెల్టు షాపులపై చర్యలు తీసుకోండి: ఎక్సైజ్ సీఐకి గ్రామస్తుల వినతి!

Demand to Closure Illegal Belt Shops in Utukuru: Villagers Submit Memorandum to Excise CI

Palnadu District: క్రోసూరు మండలం ఊటుకూరు గ్రామంలో అక్రమంగా నడుస్తున్న మద్యం బెల్టు షాపులను వెంటనే బంద్ చేయించాలని కోరుతూ గ్రామ ప్రజలు ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ తులసికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఊటుకూరు గ్రామంలో సుమారు 10 అక్రమ బెల్టు షాపుల్లో మద్యం అమ్మకాలు జోరుగా సాగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

గతంలో ‘వంద రోజులు 100 గ్రాములు’ కార్యక్రమంలో భాగంగా స్థానిక ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్‌కు ( Bhashyam Praveen ) కూడా ఈ సమస్యపై వినతిపత్రం ఇచ్చామని, బెల్టు షాపులు తీసివేయిస్తామని ఆయన హామీ ఇచ్చారని గ్రామస్తులు గుర్తుచేశారు. అయినప్పటికీ గ్రామంలో ఇప్పటికీ అక్రమ మద్యం అమ్మకాలు ఆగడం లేదని తెలిపారు. గ్రామంలోనే మద్యం దొరుకుతుండటంతో తాగే వారి సంఖ్య బాగా పెరిగిపోతోందని, బెల్టు షాపులు లేకపోతే కనీసం కొంతమంది అయినా మద్యపానానికి దూరంగా ఉంటారని పేర్కొన్నారు.

అంతేకాకుండా, బెల్టు షాపుల నిర్వాహకులు వ్యసనపరులకు మద్యం ఇచ్చి.. దానికి బదులుగా ఇళ్లల్లో ఉండే సెల్ ఫోన్లు, గ్యాస్ సిలిండర్లు, బియ్యం, ఆయిల్ ప్యాకెట్లను తాకట్టుగా పెట్టించుకుంటున్నారని గ్రామస్తులు వాపోయారు. దీనివల్ల కుటుంబాలు ఆర్థికంగా నాశనమై, రోడ్డున పడుతున్నాయని ఆవేదన చెందారు. కాబట్టి గ్రామంలో బెల్టు షాపులు లేకుండా తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గ్రామస్తుల విన్నపంపై స్పందించిన సీఐ తులసి.. గ్రామంలో బెల్టు షాపులు లేకుండా తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం పల్నాడు జిల్లా కార్యదర్శి జి. రవిబాబు మాట్లాడుతూ.. బెల్టు షాపుల వల్ల ఊటుకూరు ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారన్నారు. అధికారులు ఇచ్చిన హామీని త్వరగా నిలబెట్టుకోవాలని, లేనిపక్షంలో ఆగస్టు 15న గ్రామ ప్రజలందరినీ సమీకరించి బెల్టు షాపులు మూసివేసే వరకు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజా వేదిక నాయకులు, గ్రామస్తులు బోడేపూడి ప్రతాప్, బుల్లిపల్లి రోశయ్య, పెరుమాలపల్లి నాగరాజు, జెర్రిపోతు లోకేష్, గంజిమాల మేరీ, గంజిమాల వెంకాయమ్మ, గంజిమాల చిన్నమ్మయి తదితరులు పాల్గొన్నారు.

Related posts

నరసరావుపేట మున్సిపల్ రేసు: నోటిఫికేషన్ రాకముందే ‘సెల్ఫ్’ ప్రచారాల హోరు!

రేపు రాష్ట్రవ్యాప్తంగా కాలేజీల బంద్: ఏబీవీపీ పిలుపు

గురజాలలో పోలీసుల ‘కార్డన్ అండ్ సెర్చ్’: 26 వాహనాలు స్వాధీనం!