వర్షపు నీటి సమస్యపై తక్షణమే స్పందించిన మంత్రి కందుల దుర్గేష్!
Nidadavolu: ఎంతటి బిజీ షెడ్యూల్‌లో ఉన్నప్పటికీ ప్రజా సమస్యల పట్ల తక్షణమే స్పందించి పరిష్కరించడమే తమ ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ ( Kandula Durgesh ) మరోసారి నిరూపించారు. సమస్య చిన్నదైనా, పెద్దదైనా ప్రజలు ఇబ్బంది పడుతున్నారంటే చాలు.. ఉన్నతాధికారులను ఉసిగొల్పి సెకన్ల వ్యవధిలో పరిష్కారం చూపడంలో ఆయన తనదైన మార్కు చూపిస్తున్నారు.
శనివారం భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభోత్సవ ( Bhogapuram International Airport ) అత్యంత ముఖ్యమైన కార్యక్రమంలో మంత్రి దుర్గేష్ ఎంతో బిజీగా గడిపారు. అయినా కూడా, భారీ వర్షాల కారణంగా నిడదవోలు బస్టాండ్ ఆవరణలో వర్షపు నీరు నిలిచిపోయి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారనే విషయం ఆయన దృష్టికి వచ్చింది. వెంటనే స్పందించిన మంత్రి.. అత్యంత బిజీ పర్యటనలోనూ నిడదవోలు సమస్యపై దృష్టి సారించారు.
వెంటనే సంబంధిత పురపాలక, రవాణా శాఖ అధికారులతో ఫోన్‌లో మాట్లాడి, యుద్ధప్రాతిపదికన వర్షపు నీటిని తొలగించాలని ఆదేశించారు. మంత్రి కందుల దుర్గేష్ ఆదేశాలతో తక్షణమే రంగంలోకి దిగిన అధికారులు, భారీ మోటార్లను ఏర్పాటు చేసి నిలిచిన నీటిని బయటకు పంపించడంతో ప్రయాణికులకు పెద్ద ఉపశమనం లభించింది.
ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ.. “ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు స్పందించడం నా ప్రాథమిక బాధ్యత. నేను ఎక్కడ ఉన్నా, ఎంత బిజీగా ఉన్నా ప్రజా సమస్యల పరిష్కారానికి మన ప్రభుత్వం ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉంటుంది” అని వ్యాఖ్యానించారు. అంతేకాకుండా, ప్రస్తుతం గోదావరికి వరదలు వస్తున్న నేపథ్యంలో నిడదవోలు నియోజకవర్గ ప్రజలు, రైతాంగం అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు.
సమస్య తెలియగానే దూర ప్రాంతంలో ఉండి కూడా క్షణాల వ్యవధిలో పరిష్కరించిన మంత్రి కందుల దుర్గేష్ సమర్థవంతమైన పనితీరుపై నిడదవోలు ప్రజలు, నిత్య ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రజా సమస్యల పట్ల ఆయన చూపిస్తున్న నిబద్ధతకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.