Palnadu District: పల్నాడు జిల్లా గురజాల వెంకట రమణ కాలనీలో మంగళవారం తెల్లవారుజామున పోలీసులు విస్తృత స్థాయిలో ‘కార్డన్ అండ్ సెర్చ్’ నిర్వహించారు. ప్రాంతంలో శాంతిభద్రతల పరిరక్షణ, నేర నియంత్రణ మరియు చట్టవ్యతిరేక కార్యకలాపాల నిర్మూలన లక్ష్యంగా ఈ తనిఖీలు చేపట్టారు.
పల్నాడు జిల్లా అడిషనల్ ఎస్పీ రోహిత్ కుమార్ చౌదరి (IPS) ఆదేశాల మేరకు, గురజాల సబ్ డివిజన్ డీఎస్పీ మహేశ్వరరావు పర్యవేక్షణలో ఈ ప్రత్యేక ఆపరేషన్ కొనసాగింది. ఇందులో భాగంగా కాలనీలోని రౌడీషీటర్లు, ట్రబుల్ మాంగర్లు మరియు పాత కేసుల నిందితుల ఇళ్లను, పరిసర ప్రాంతాలను పోలీసులు క్షుణ్ణంగా తనిఖీ చేశారు.
తనిఖీల సమయంలో సరైన పత్రాలు (Documents) లేని 24 ద్విచక్ర వాహనాలు, 2 ఆటోలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సోదాల అనంతరం పోలీసు అధికారులు కాలనీలో ఫుట్ పెట్రోలింగ్ నిర్వహించి స్థానిక ప్రజలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా హెల్మెట్ ధరించడం, మద్యం సేవించి వాహనాలు నడపకపోవడం, మాదకద్రవ్యాల (Drugs) దుష్పరిణామాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. గ్రామంలో లేదా కాలనీలో ఎలాంటి అనుమానాస్పద వ్యక్తులు కనిపించినా వెంటనే ‘112’ నంబర్‌కు సమాచారం అందించాలని సూచించారు.
ముందస్తు చర్యల్లో భాగంగానే ఈ తనిఖీలు నిర్వహించామని, శాంతిభద్రతలకు భంగం కలిగించే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు ఉంటాయని అధికారులు హెచ్చరించారు. ఈ తనిఖీల్లో గురజాల సీఐ మురళీకృష్ణ, కారంపూడి సీఐ భాస్కర్‌రావు, గురజాల ఎస్‌ఐ వినోద్, కారంపూడి ఎస్‌ఐ వాసు, దాచేపల్లి ఎస్‌ఐ ఖాసీం మరియు పలువురు సిబ్బంది పాల్గొన్నారు.