Home » Renting Economy: కొత్తగా వచ్చేస్తున్న ఈ నయా ట్రెండ్ గురించి తెలుసా.!

Renting Economy: కొత్తగా వచ్చేస్తున్న ఈ నయా ట్రెండ్ గురించి తెలుసా.!

by TaajaVartha
Renting Economy

Renting Economy: రెంటింగ్ ఎకానమీ గురించి తెలియకపోతే మీరు ఔట్ డేటెడ్ అయిపోయినట్టే..!

ఒకప్పుడు ఉద్యోగం వచ్చిందో లేదో.. ముందుగా టీవీ, ఫ్రిజ్, వాషింగ్ మెషిన్, మంచం వంటి సొంత సామాగ్రిని కొనుగోలు చేయడమే ప్రతిఒక్కరి తొలి ప్రాధాన్యంగా ఉండేది. కానీ నేటితరం ఆలోచనలు లీజులు, ఈఎమ్‌ఐల చుట్టూ కాకుండా.. కొత్తగా అందుబాటులోకి వచ్చిన ‘రెంటింగ్ ఎకానమీ’ (Renting Economy) చుట్టూ తిరుగుతున్నాయి. లక్షల రూపాయలు వెచ్చించి సొంతంగా వస్తువులు కూడబెట్టుకోవడం కంటే, నెలకు కొన్ని వందల రూపాయలకే అద్దెకు తెచ్చుకుని లగ్జరీ జీవితాన్ని అనుభవించడమే మేలని నేటి యూత్ భావిస్తున్నారు. ‘సొంతంగా ఆస్తి కొనుగోలు చేయడం’ కంటే ‘తక్కువ ఖర్చుతో సదుపాయంగా జీవించడం’ అనే యూజర్ ఎకానమీ మైండ్‌సెట్ ఇప్పుడు దేశవ్యాప్తంగా కొత్త వేవ్‌ని క్రియేట్ చేస్తోంది.

ఈ నయా ట్రెండ్‌కు (New trend) హైదరాబాద్‌లో ఐటీ ఉద్యోగం చేస్తున్న వారి జీవనశైలే ఒక ఉదాహరణ. ఉద్యోగంలో చేరిన కొత్తలో వేలాది రూపాయలు పెట్టి సామాన్లు కొనేంత స్థోమత లేకపోవడం, అలాగని ఖాళీ గదిలో ఉండలేక  అద్దె యాప్‌లను ఆశ్రయిస్తున్నారు. మంచం, పరుపు, వాషింగ్ మెషిన్, వర్కింగ్ డెస్క్ అన్నింటినీ కలిపి ఒకే ‘కాంబో ప్యాకేజీ’ కింద నెలకు కేవలం రూ. 3,400లకే అద్దెకు దొరకడం విశేషం. కేవలం విడి వస్తువులే కాకుండా.. ‘స్టూడియో అపార్ట్‌మెంట్ ప్యాకేజ్’, ‘బెడ్‌రూమ్ కిట్’ లాంటి పేర్లతో కంపెనీలు అందిస్తున్న ఈ కాంబో ప్యాక్‌లు బ్యాచిలర్లు, నగరాలకు వచ్చే వలస ఉద్యోగుల పాలిట కొండంత అండగా మారుతున్నాయి.

ఇదివరకు కేవలం బెంగళూరు (Bangalore), హైదరాబాద్ (hyderabad), ముంబై (mumbai) వంటి మెట్రో నగరాలకే పరిమితమైన ఈ ‘రెంటింగ్ సేవల సంస్కృతి’ (Renting Economy) ఇప్పుడు టౌన్లు, చిన్న నగరాలకూ శరవేగంగా విస్తరిస్తోంది. ఉదాహరణకు మార్కెట్‌లో ఒక డబుల్ డోర్ రిఫ్రిజిరేటర్ కొనాలంటే కనీసం రూ. 20 వేలు ఖర్చవుతుంది. అదే అద్దెకు తీసుకుంటే నెలకు కేవలం రూ. 600 సరిపోతుంది. అలాగే రూ. 300 నుంచి రూ. 500లకే వాషింగ్ మెషిన్లు, కాటన్‌ మంచాలు లభిస్తున్నాయి. వస్తువులు పాడైతే ఉచితంగా రిపేర్ చేసే బాధ్యత కంపెనీలదే కావడం, నిర్ణీత కాలం పూర్తయ్యాక అదనపు ఖర్చు లేకుండా కొత్త డిజైన్లకు అప్‌గ్రేడ్ అయ్యే వెసులుబాటు ఉండటం వల్ల చాలామంది ఈ రెంటింగ్ ఎకానమీ ట్రెండ్‌ వైపే మొగ్గు చూపుతున్నారు.

అయితే ఈ రెంటింగ్ ఎకానమీ (Renting Economy) లేదా ‘అద్దె సంస్కృతి’లో ముందడుగు వేసే ముందు వినియోగదారులు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి. ఒప్పంద కాలపరిమితి (లాక్-ఇన్ పీరియడ్), సెక్యూరిటీ డిపాజిట్ నిబంధనలు, క్యాన్సిలేషన్ ప్రాసెస్ గురించి ముందే క్షుణ్ణంగా తెలుసుకోవాలి. ముఖ్యంగా డెలివరీ సమయంలోనే వస్తువుపై ఏవైనా గీతలు, డ్యామేజ్‌లు ఉన్నాయో లేదో చూసి ఫోటోలు, వీడియోలు తీసి పెట్టుకోవడం మంచిది. దీనివల్ల వస్తువును తిరిగి ఇచ్చేటప్పుడు ‘డ్యామేజ్ ఛార్జీల’ పేరిట కంపెనీలు అదనపు బాదుడు వేయకుండా జాగ్రత్త పడవచ్చు. అలాగే మీ ఆధార్, పాన్ వివరాలు సబ్‌మిట్ చేసేముందు ఆయా యాప్‌ల కస్టమర్ రేటింగ్స్, విశ్వసనీయతను సరిచూసుకోవడం శ్రేయస్కరం.

ఇది చదివారా..? AI తో మెదడుకు మతిమరుపు

Related Articles

Leave a Comment

Are you sure want to unlock this post?
Unlock left : 0
Are you sure want to cancel subscription?
-
00:00
00:00
Update Required Flash plugin
-
00:00
00:00