Home » ఆంధ్ర-తెలంగాణల అపూర్వ బంధం రోదసిని జయించింది

ఆంధ్ర-తెలంగాణల అపూర్వ బంధం రోదసిని జయించింది

by TaajaVartha
Skyroot Founders Create History With Vikram 1 Success

ఆకాశానికి నిచ్చెన వేసి విజయం సాధించిన తెలుగు తేజాలు

భాష ఒక్కటే.. కానీ రాష్ట్రాలు వేరు. ఒకరు ఆంధ్ర మట్టిలో పుట్టి పెరిగితే, మరొకరు తెలంగాణ గుండెకాయ లాంటి హైదరాబాద్‌లో ఎదిగారు. సరిహద్దులు వేరైనా, వారి ఆలోచనలు ఒకటే. ప్రాంతీయ విభేదాలకు తావులేకుండా ఇద్దరు తెలుగు యువకులు చేతులు కలిపితే.. ఏకంగా అంతరిక్షాన్నే ముద్దాడవచ్చని నిరూపించారు ‘స్కైరూట్ ఏరోస్పేస్’ వ్యవస్థాపకులు పవన్ కుమార్ చందన, నాగ భరత్ డాకా. శ్రీహరికోట నుంచి దేశంలోనే మొట్టమొదటి ప్రైవేట్ ఆర్బిటాల్ రాకెట్ ‘విక్రమ్-1’ విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లిన వేళ, ఈ ఇద్దరు తెలుగు బిడ్డల విజయగాథ ప్రతి ఒక్కరిలోనూ సరికొత్త స్ఫూర్తిని నింపుతోంది.

సరిహద్దులు దాటిన సఖ్యత.. ఇస్రోలో చిగురించిన కల!
ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి, విశాఖపట్నంలో పెరిగిన నాగ భరత్ డాకా.. హైదరాబాద్‌లో పుట్టి పెరిగిన పవన్ కుమార్ చందన ఒకరికొకరు పరిచయమైంది తిరువనంతపురంలోని ఇస్రో విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్‌లో. 2012లో ఇద్దరూ ఒకే నెలలో సైంటిస్టులుగా కొలువులో చేరారు.

ఆంధ్ర, తెలంగాణ విడిపోయిన కాలాన్నే.. వీరు తమ స్నేహబంధంతో, ఒకే లక్ష్యంతో సరికొత్త విజయానికి పునాదిగా మార్చుకున్నారు. ఇస్రోలో ఐదేళ్ల పాటు జీఎస్‌ఎల్‌వీ మార్క్-3 వంటి కీలక రాకెట్ ప్రాజెక్టులపై కలిసి పనిచేస్తున్నప్పుడు, ఇద్దరి ఆలోచనలు ఒక్కటయ్యాయి. మన దేశంలో ప్రైవేట్ స్పేస్ రంగాన్ని ఎందుకు శాసించకూడదనే ఒకే ఒక్క ఆలోచన ఆ ఇద్దరినీ భాగస్వాములుగా మార్చింది.

రెండు రాష్ట్రాల ప్రతిభ.. ఒకే వేదిక ‘స్కైరూట్’
సురక్షితమైన ప్రభుత్వ ఉద్యోగాలను వదిలేసి, రిస్క్ అని తెలిసినా ఇద్దరూ కలిసి 2018లో హైదరాబాద్ వేదికగా ‘స్కైరూట్ ఏరోస్పేస్’ను స్థాపించారు. ఆంధ్ర నుంచి వచ్చిన నాగ భరత్ టెక్నాలజీ, ఆపరేషన్స్ (COO) బాధ్యతలను భుజాన వేసుకుంటే, తెలంగాణకు చెందిన పవన్ కుమార్ సీఈఓగా, చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్‌గా నాయకత్వాన్ని వహించారు.

రెండు రాష్ట్రాల నైపుణ్యం, ఐఐటీల ప్రతిభ (ఐఐటీ మద్రాస్, ఐఐటీ ఖరగ్‌పూర్) ఒకచోట చేరితే ఎలాంటి అద్భుతాలు సృష్టించవచ్చో వీరిద్దరూ చేసి చూపించారు. ఒకవైపు కఠినమైన పరిశోధనలు, మరోవైపు పెట్టుబడుల సమీకరణ.. ఇలా ప్రతి అడుగులోనూ ఒకరికొకరు అండగా నిలబడుతూ, ఒకే ఆత్మతో పనిచేశారు.

ఐక్యతతోనే సాధ్యమైన ‘విక్రమ్’ విజయం!
2022లో ‘విక్రమ్-ఎస్’ అనే సబ్-ఆర్బిటాల్ రాకెట్‌తో ప్రైవేట్ అంతరిక్ష రంగంలో తొలి అడుగు వేసిన ఈ తెలుగు ద్వయం.. ఇప్పుడు పూర్తిస్థాయి ఆర్బిటాల్ రాకెట్ ‘విక్రమ్-1’ను విజయవంతంగా నింగిలోకి పంపి విశ్వవిజేతలుగా నిలిచారు.

ఈ విజయం కేవలం ఒక రాకెట్ ప్రయోగం మాత్రమే కాదు.. “రెండు తెలుగు రాష్ట్రాలు కలిసికట్టుగా అడుగులు వేస్తే, పరస్పరం సహకరించుకుంటే ఎలాంటి అసాధ్యాలనైనా సుసాధ్యం చేయవచ్చు, దేశానికే గర్వకారణంగా నిలవవచ్చు” అని చాటిచెప్పిన నిలువెత్తు నిదర్శనం. ప్రాంతీయ భేదాలను పక్కనబెట్టి, ప్రతిభను పెట్టుబడిగా పెట్టి అంతరిక్షంలో తెలుగు జెండాను ఎగరేసిన పవన్ కుమార్ చందన, నాగ భరత్ డాకా నిజంగానే నేటి తరానికి ఆదర్శమూర్తులు!

ఇది చదివారా..? అరవనాట ఆపరేషన్ పాలిటిక్స్

Related Articles

Leave a Comment

Are you sure want to unlock this post?
Unlock left : 0
Are you sure want to cancel subscription?
-
00:00
00:00
Update Required Flash plugin
-
00:00
00:00