Bhogapuram Airport: వార్త రాయడం ఒక కళ.. కానీ ఇప్పుడు రీల్ చేయడం అంతకన్నా పెద్ద వ్యాపారం. ఒకప్పుడు ఎక్కడైనా చిన్న సంఘటన జరిగినా, పెద్ద ఈవెంట్ ఉన్నా.. ప్రెస్ కార్డ్ మెడలో వేసుకుని, చేతిలో మైక్ పట్టుకుని తిరిగే మెయిన్ స్ట్రీమ్ ప్రింట్ & టీవీ మీడియా రిపోర్టర్లదే (Media Reporters) హవా ఉండేది. కానీ కాలం మారింది, సీన్ రివర్స్ అయింది! ఇప్పుడు కెమెరా ముందు రెండు స్టెప్పులేసి, ఒక ఫిల్టర్ తగిలించి, బ్యాక్‌గ్రౌండ్‌లో ట్రెండింగ్ మ్యూజిక్ పెట్టి “హాయ్ గాయ్స్..” అనే సోషల్ మీడియా స్టార్లదే రాజ్యమేలుతోంది. ఎంతలా అంటే.. ప్రజాస్వామ్య నాలుగో స్తంభం అనుకునే మెయిన్ స్ట్రీమ్ మీడియా మెల్లగా సైడ్ అయిపోతే, సైడ్ క్యారెక్టర్ లాంటి సోషల్ మీడియానే (Social Media) ఇప్పుడు అందరికీ ‘అతి ముద్దు’గా మారిపోయింది!
గ్రౌండ్ రిపోర్టర్లకు గేట్ పాస్.. ఇన్‌ఫ్లూయెన్సర్లకు విఐపి పాస్!
భోగాపురం ఎయిర్‌పోర్ట్ కవరేజ్ విషయంలో మెయిన్ స్ట్రీమ్ మీడియాను పక్కన పెట్టి.. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లకు మాత్రం అధికారులు రెడ్ కార్పెట్ వేయడం వివాదం రేపుతోంది. అధికారులు, ప్రభుత్వం కూడా ఈ విషయాన్ని పట్టించుకోకపోవడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. అధికారులకు, నిర్వాహకులకు మెయిన్ స్ట్రీమ్ జర్నలిస్టుల కష్టం కంటే.. ఇన్ఫ్లుయెన్సర్ల ‘వ్యూస్’ మాత్రమే కనిపిస్తున్నాయి. దశాబ్దాలుగా ఫీల్డ్‌లో ఉంటూ, ప్రజల సమస్యలపై వార్తలు రాసే సీనియర్ జర్నలిస్టులకు గేటు దగ్గరే “నో ఎంట్రీ” కార్డులు దర్శనమిస్తుంటే.. ఇన్స్టాగ్రామ్ (Instagram) , యూట్యూబ్ (youtube)లో లంబోర్గిని కార్ల ముందు ఫోజులిచ్చే రీల్స్ రాయుళ్లకు మాత్రం అధికారులు స్పెషల్ పర్మిషన్లతో రెడ్ కార్పెట్ పరిచి మరీ రాచమర్యాదలు చేస్తున్నారు. “వార్త రాస్తే కేవలం పేపర్‌లో వస్తుంది.. అదే వీళ్లు రీల్ చేస్తే మిలియన్ల వ్యూస్ వస్తాయి” అనే పిచ్చి మైకంలో అధికారులు ఊగిపోతున్నారు. అంతెందుకు ఇటీవల జిల్లాల పర్యటనలో ఉన్న సీఎం చంద్రబాబు (chandrababuNaidu) సైతం ఇన్ఫ్లుయెన్సర్లతో స్పెషల్ మీటింగ్స్ పెడుతున్నారు. ప్రభుత్వం చేసే పనులను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిందిగా అభ్యర్థిస్తున్నారు. కానీ వాళ్లు ఎంత చేసినా వైరల్ కావడంత ప్ప అందులో సబ్జెక్ట్ ఉండదన్న విషయం మర్చిపోయినట్టున్నారు. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా (Electronic Media)లో అయితే సమగ్రంగా కథనాలు ప్రసారం చేసే అవకాశం ఉంటుంది. దానివల్ల సబ్జెక్ట్ లోతుగా ప్రజలకు చేరుతుంది. కానీ ముందొచ్చిన చెవులు కంటే వెనకొచ్చిన కొమ్ములు వాడి అన్నట్టుగా సబ్జెక్ట్ తో సంబంధం లేకుండా.. ఆహా.. ఓహో అంటూ ఆకాశానికెత్తే రీల్స్ రాయుళ్లకే క్రేజ్ పెరిగిపోతోంది.
ఒకప్పుడు టీవీ సీరియల్స్, వార్తల ఛానెళ్లు చూసి రోజు ప్రారంభించే జనాలు.. ఇప్పుడు ఉదయం లేవగానే ఇన్స్టాగ్రామ్ రీల్స్, యూట్యూబ్ షార్ట్స్ స్క్రోల్ చేస్తున్నారు. దీంతో కార్పొరేట్ కంపెనీల నుంచి ప్రభుత్వ అధికారుల వరకు అందరి ఫోకస్ ఈ సోషల్ మీడియా స్టార్ల మీదే పడింది. లక్షలు ఖర్చుపెట్టి టీవీల్లో యాడ్స్ ఇవ్వడం కంటే.. ఇద్దరు ఇన్‌ఫ్లూయెన్సర్లను తెచ్చి డ్యాన్స్ చేయిస్తే మేటర్ ఈజీగా వైరల్ అవుతుందని భావిస్తున్నారు. నిజమైన వార్తలను, సమాజానికి మేలు చేసే కథనాలను పక్కనపెట్టి.. హంగామా, షో-ఆఫ్ చేసే వాళ్లకే ప్రాధాన్యం ఇవ్వడం ఇప్పటి లేటెస్ట్ ట్రెండ్ అయిపోయింది.
నిజమైన మీడియా గొంతు నొక్కేస్తే ప్రమాదం ఎవరికి?
అయితే, ఇక్కడో చిన్న లాజిక్ మర్చిపోతున్నారు. రీల్స్ చేసేవాళ్లు ప్రోమోలు చేస్తారు, ప్రమోషన్లు చేస్తారు.. కానీ రేపు ఏదైనా సమస్య వస్తే ప్రజాక్షేత్రంలో నిలబడి నిలదీసేది మాత్రం అదే మెయిన్ స్ట్రీమ్ మీడియా! తాత్కాలిక పబ్లిసిటీ కోసం సీనియర్ జర్నలిస్టులను, లోకల్ రిపోర్టర్లను పక్కనపెట్టి.. రీల్స్ రాజాలకు మాత్రమే ప్రాధాన్యం ఇస్తే, అది భవిష్యత్తులో వ్యవస్థలకే పెద్ద మచ్చగా మారనుంది. ఇప్పటికైనా అధికారులు, ఈవెంట్ నిర్వాహకులు ఈ ‘సోషల్ మీడియా రోగం’ నుంచి బయటపడి, ప్రాధాన్యతలు ఏంటో గుర్తించాల్సిన అవసరం ఎంతైనా ఉంది!