DSC Recruitment: డీఎస్సీ ఉపాధ్యాయ నియామకాల్లో భారీ అక్రమాలు జరిగాయని, దీనికి నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ( Nara Lokesh ) వెంటనే రాజీనామా చేయాలని వైయస్సార్ సీపీ PAC సభ్యులు, వినుకొండ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు ( Bolla Bramhanaidu ) డిమాండ్ చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయం పిలుపు మేరకు నిర్వహించనున్న నిరసనలు, రిలే నిరాహార దీక్షలపై వినుకొండ నియోజకవర్గ పరిశీలకులు బాసు లింగారెడ్డి సమక్షంలో ఐదు మండలాల యువజన, విద్యార్థి విభాగాల కన్వీనర్లు, నాయకులతో ఆయన సమాయాత్త సమావేశం నిర్వహించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ‘సూపర్ సిక్స్’ పేరుతో ఇచ్చే హామీలను విస్మరించిందని, అర్హులను పక్కనపెట్టి స్పోర్ట్స్ కోటా పేరుతో అక్రమ వెయిటేజ్ మార్కులు కలిపి అధికార పార్టీ అనుచరులకు డీఎస్సీ ఉద్యోగాలు కట్టబెట్టారని ఆయన తీవ్రంగా విమర్శించారు.
గతంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ( Ys Jagan )పాలనలో గ్రామ సచివాలయాల ద్వారా లక్షా 35 వేలకు పైగా ఉద్యోగాలను అత్యంత పారదర్శకంగా భర్తీ చేశారని, కానీ ప్రస్తుత ప్రభుత్వం కేవలం 16 వేల పోస్టుల భర్తీలోనే తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటోందని బొల్లా బ్రహ్మనాయుడు పేర్కొన్నారు. అంతేకాకుండా భోగాపురం విమానాశ్రయం సహా గత ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధి పనులకు క్రెడిట్ కొట్టేయడం చంద్రబాబు ప్రభుత్వానికి అలవాటుగా మారిందని ధ్వజమెత్తారు. వినుకొండలో ఘాట్ రోడ్డు, పట్టణాభివృద్ధి పనులను తామే చేశామని చెప్పుకోవడం స్థానిక ఎమ్మెల్యేకు సిగ్గుచేటని ఎద్దేవా చేశారు. ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలు, అక్రమాలపై యువత, విద్యార్థి శ్రేణులు తిరగబడాలని, ఆందోళన కార్యక్రమాలను మరింత ఉధృతం చేయాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.
మరోవైపు వినుకొండ నియోజకవర్గంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని, వరుస హత్యల ఘటనలతో ప్రజలు భయాందోళనలో ఉన్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. వినుకొండ హత్యలపై నిష్పాక్షిక విచారణ జరిపించాలని, అవసరమైతే సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేశారు. భవిష్యత్తులో వైఎస్సార్‌సీపీ తిరిగి అధికారంలోకి వచ్చిన వెంటనే వినుకొండలో జరిగిన ప్రతి దాడి, హత్య, తప్పుడు కేసులు మరియు అధికార దుర్వినియోగంపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులెవరినీ వదిలిపెట్టబోమని హెచ్చరించారు. పార్టీ పిలుపునిచ్చిన నిరసన కార్యక్రమాల్లో విద్యార్థులు, యువత, వైఎస్సార్‌సీపీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాలను జయప్రదం చేయాలని నియోజకవర్గ పరిశీలకులు బాసు లింగారెడ్డి కోరారు.