మధ్యవర్తిత్వంతో వివాదాలకు శాశ్వత పరిష్కారం

Mediation for the Nation: APSLSA Launches Free Legal Aid and Dispute Resolution Drive in Sattenapalli

సత్తెనపల్లిలో వారం రోజుల అవగాహన కార్యక్రమం ప్రారంభం

Mediation for the Nation: కోర్టు కేసుల చుట్టూ ఏళ్ల తరబడి తిరిగే అవసరం లేకుండా, వివాదాలను సత్వరంగా మరియు సామరస్యపూర్వకంగా పరిష్కరించేందుకు మధ్యవర్తిత్వం (Mediation) ఎంతో ఉత్తమమైన మార్గమని మండల న్యాయసేవా కమిటీ చైర్మన్, సీనియర్ డివిజన్ సివిల్ జడ్జి వి. విజయకుమార్ రెడ్డి తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ, అమరావతి ఆధ్వర్యంలో చేపట్టిన “Mediation for the Nation” కార్యక్రమంలో భాగంగా పల్నాడు జిల్లా సత్తెనపల్లి పట్టణంలోని తాలూకా సెంటర్‌లో వారం రోజుల ప్రత్యేక అవగాహన కార్యక్రమం శుక్రవారం ఘనంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా స్థానిక ప్రజలకు మధ్యవర్తిత్వం ప్రాముఖ్యత మరియు ఉచిత న్యాయ సేవలపై కరపత్రాలను పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్యానెల్ అడ్వకేట్లు పాటిబండ్ల రవి, గుజ్జర్లపూడి సురేష్ మాట్లాడుతూ మధ్యవర్తిత్వ విధానం ద్వారా ఎలాంటి కేసులను పరిష్కరించుకోవచ్చో వివరించారు. సివిల్ తగాదాలు, బ్యాంకు రుణాల కేసులు, రాజీపడదగిన క్రిమినల్ కేసులు, మనోవర్తి కేసులు, చెక్ బౌన్స్ వ్యవహారాలు, రెవెన్యూ వివాదాలతో పాటు కోర్టు మెట్లు ఎక్కక ముందే పరిష్కరించుకోదగిన ప్రీ-లిటిగేషన్ కేసులను మధ్యవర్తిత్వం ద్వారా వేగంగా, పరస్పర అంగీకారంతో ముగించుకోవచ్చని తెలిపారు. కక్షిదారులు కోర్టు విచారణలకు ప్రత్యామ్నాయంగా ఈ మార్గాన్ని ఎంచుకోవడం వల్ల సమయం, ధనం ఆదా అవ్వడమే కాకుండా ఇరుపక్షాల మధ్య వైషమ్యాలు తగ్గి, మళ్లీ సత్సంబంధాలు నెరపే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.

అనంతరం పారా లీగల్ వాలంటీర్లు అట్లూరి జ్యోతి, గోపయ్య పాల్గొని న్యాయ సేవాధికార సంస్థ అందిస్తున్న ఉచిత న్యాయ సేవలు, మధ్యవర్తిత్వంలో ఉండే పారదర్శకత గురించి ప్రజలకు క్షుణ్ణంగా అవగాహన కల్పించారు. కక్షిదారులు ఈ సువర్ణ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ వివాదాలను ప్రశాంతమైన వాతావరణంలో పరిష్కరించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కోర్టు సిబ్బంది, పారా లీగల్ వాలంటీర్లు మరియు స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Related posts

నరసరావుపేట మున్సిపల్ రేసు: నోటిఫికేషన్ రాకముందే ‘సెల్ఫ్’ ప్రచారాల హోరు!

రేపు రాష్ట్రవ్యాప్తంగా కాలేజీల బంద్: ఏబీవీపీ పిలుపు

గురజాలలో పోలీసుల ‘కార్డన్ అండ్ సెర్చ్’: 26 వాహనాలు స్వాధీనం!