తల్లిపాల ప్రాముఖ్యతపై బాలింతలకు అవగాహన
World Breastfeeding Week: ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు–2026 సందర్భంగా పల్నాడు జిల్లా నరసరావుపేట ( Narasaraopeta ) ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో ఆగస్టు 1 నుంచి 7 వరకు నిర్వహించే ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద బాబు (Mla Chadalavada Aravindababu ) ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆసుపత్రి ప్రాంగణంలో సుమారు 100 మంది గర్భిణులు, బాలింతలతో తల్లిపాల ప్రాముఖ్యతపై ప్రతిజ్ఞ చేయించారు. బిడ్డ పుట్టిన మొదటి గంటలోనే తల్లిపాలు ఇవ్వడం, ముర్రుపాల ప్రాముఖ్యత, రోగనిరోధక శక్తి పెంచడంలో తల్లిపాల పాత్రపై వైద్యులు వారికి సమగ్ర అవగాహన కల్పించారు.
కార్యక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్ అరవింద బాబు మాట్లాడుతూ.. బిడ్డ పుట్టిన వెంటనే తల్లిపాలు ఇవ్వడం వల్ల తల్లి, బిడ్డల మధ్య అనుబంధం మరింత బలపడుతుందని తెలిపారు. తొలి ఆరు నెలలు తల్లిపాలు మాత్రమే అందించాలని, అవే శిశువుకు సంపూర్ణ ఆహారమని, అమృతంతో సమానమని పేర్కొన్నారు. తల్లిపాలు ( Breast Feeding ) జీర్ణక్రియను మెరుగుపరచడమే కాకుండా అనేక వ్యాధుల నుంచి రక్షణ కల్పిస్తాయని చెప్పారు. ప్రభుత్వ ఆసుపత్రిలో గర్భిణులు, బాలింతలకు మెరుగైన వైద్యసేవలతో పాటు ప్రతి నెల 9వ తేదీన సుబ్రాయ గుప్తా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా పౌష్టికాహారం పంపిణీ చేస్తున్నామని తెలిపారు. ఆసుపత్రి సిబ్బంది సేవలను అభినందిస్తూ, ప్రతి ఒక్కరూ సొంత ఆసుపత్రిలా భావించి రోగులకు సేవలు అందించాలని సూచించారు.
Awareness Drive on Breastfeeding Importance: MLA Dr. Aravinda Babu Inagurates World Breastfeeding Week
పల్నాడు జిల్లా మహిళా, శిశు అభివృద్ధి శాఖ ప్రాజెక్టు డైరెక్టర్ (పీడీ) నాగమల్లేశ్వరి మాట్లాడుతూ.. బిడ్డ పుట్టిన వెంటనే వచ్చే ముర్రుపాలు శిశువుకు సహజమైన తొలి టీకాలా పనిచేస్తాయని వివరించారు. శిశువుకు అవసరమైన నీరు, ప్రోటీన్లు, విటమిన్లు, కొవ్వులు సమతుల్యంగా తల్లిపాలలోనే లభిస్తాయని చెప్పారు. ప్రతి తల్లి తొలి ఆరు నెలల పాటు కేవలం తల్లిపాలు మాత్రమే అందించాలని, ఈ సందేశాన్ని గ్రామీణ స్థాయి వరకు తీసుకెళ్లేందుకు అంగన్వాడీ కార్యకర్తలు, సూపర్వైజర్లు కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ఈ వారం రోజుల పాటు గర్భిణులు, బాలింతలకు ఆరోగ్య విద్య, పోషకాహారం, శిశు సంరక్షణపై ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని ఆసుపత్రి అధికారులు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ డాక్టర్ లక్కిరెడ్డి వెంకటేశ్వరరెడ్డి, డీఎంహెచ్‌వో డాక్టర్ చుక్కా రత్న మన్మోహన్, ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సతీష్, కమిటీ సభ్యులు, వైద్యులు, నర్సింగ్ సిబ్బంది, ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.