AP

ఎయిర్ పోర్టులను తలపిస్తున్న రైల్వేస్టేషన్లు

ముస్తాబైన మంగళగిరి,రాయనపాడు, కంభం రైల్వే స్టేషన్లు

నేడు జాతికి అంకితం చేయనున్న ప్రధాని మోదీ

అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద రూ.12.56 కోట్ల వ్యయంతో ఏపీలో ఆధునికీకరించిన మూడు రైల్వే స్టేషన్లు నేడు ప్రారంభం కానున్నాయి. ఈ రోజు ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్ విధానంలో జాతికి అంకితం చేయనున్నారు. ఏపీలోని మంగళగిరి, రాయనపాడు, కంభం రైల్వేస్టేషన్లు అమృత్ భారత్ పథకం కింద అధునీకరించారు.

ఆధునికీకరణలో భాగంగా స్టేషన్‌కు కార్పొరేట్ లుక్‌తో కొత్త భవనాలు, సరికొత్త బుకింగ్ కౌంటర్లు, డిజిటల్ సూచికలు, ఆధునిక వెయిటింగ్ హాళ్లు, వీఐపీ లాంజ్, ఆకర్షణీయమైన ల్యాండ్‌స్కేపింగ్‌ను ఏర్పాటు చేశారు. ప్లాట్‌ఫారమ్‌లను ఆధునీకరించడంతో పాటు మెరుగైన మరుగుదొడ్లు, సౌకర్యవంతమైన సీటింగ్, స్పష్టమైన సైనేజీ బోర్డులను అందుబాటులోకి తీసుకొచ్చారు. ప్లాట్‌ఫారమ్‌లు 1, 4లపై కొత్త షెల్టర్లు, దివ్యాంగుల కోసం రెండు లిఫ్టులు, ర్యాంపులు, టాక్టైల్ పాత్‌వేలు, ప్రత్యేక శౌచాలయాలు ఏర్పాటు చేశారు. విశాలమైన పార్కింగ్, పాదచారుల మార్గాలు, ఆధునిక వీధి దీపాలతో పాటు మంగళగిరి ప్రాంతీయ వైభవాన్ని ప్రతిబింబించే పెయింటింగ్స్, కళాకృతులతో స్టేషన్‌ను అలంకరించారు. రాజధాని అమరావతి ప్రాంతానికి సమీపంలో సేవలందిస్తున్న ఏకైక ఎన్ఎస్‌జీ-4 కేటగిరీ స్టేషన్‌గా మంగళగిరి ప్రాధాన్యం మరింత పెరగనుంది. ఈ మేకోవర్‌తో ప్రయాణికులకు ప్రపంచ స్థాయి సౌకర్యాలు అందుబాటులోకి వచ్చాయని రైల్వే అధికారులు తెలిపారు.

రూ.35 కోట్లకు పైగా వ్యయంతో చేపట్టిన ఈ ఆధునికీకరణ పనుల్లో ప్రయాణికుల సౌకర్యాలకు అత్యధిక ప్రాధాన్యం ఇచ్చారు. ఒకటో నంబర్ ప్లాట్‌ఫారమ్‌ను 670 మీటర్ల పొడవున పునర్నిర్మించగా, 340 మీటర్ల మేర అత్యాధునిక ప్లాట్‌ఫారమ్ షెల్టర్‌ను ఏర్పాటు చేశారు. ఎయిర్ కండిషన్డ్ ప్రీపెయిడ్ వెయిటింగ్ హాల్, దివ్యాంగులకు అనుకూలమైన మోడ్యులర్ టాయిలెట్ కాంప్లెక్స్, ఫుట్ ఓవర్ బ్రిడ్జిపై రెండు లిఫ్టులు, అంధుల కోసం ప్రత్యేక టాక్టైల్ పాత్‌వేలు, ర్యాంపులు, డిజిటల్ టికెట్ కౌంటర్లు, స్వచ్ఛమైన తాగునీటి వసతులు, విశాలమైన పార్కింగ్, ల్యాండ్‌స్కేప్ నడకదారులు, ఆధునిక వీధి దీపాలను ఏర్పాటు చేశారు. కొండపల్లి కొయ్యబొమ్మల కళా సంప్రదాయాన్ని ప్రతిబింబించే కళాఖండాలతో స్టేషన్ భవనాన్ని తీర్చిదిద్దారు. విజయవాడ జంక్షన్‌పై ప్రయాణికుల రద్దీని తగ్గించే శాటిలైట్ టెర్మినల్‌గా రాయనపాడు స్టేషన్ కీలక పాత్ర పోషించనుండగా, ఇక్కడి నుంచి ప్రతిరోజూ సుమారు 12 రైళ్లు, పలు ఎక్స్‌ప్రెస్ సర్వీసులు నడిచేలా రైల్వే శాఖ ప్రణాళిక రూపొందించింది. ఈ ఆధునికీకరణతో రాయనపాడు స్టేషన్ విజయవాడ ప్రాంతంలో కీలక రైల్వే హబ్‌గా ఎదుగుతుందని, ప్రయాణికుల భద్రత, సౌకర్యాలు మరింత మెరుగుపడతాయని విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని తెలిపారు.

అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద మార్కాపురం జిల్లాలోని కంభం రైల్వే స్టేషన్‌ను ఆధునిక ప్రమాణాలతో అభివృద్ధి చేశారు. ఆసియాలోనే ప్రసిద్ధి చెందిన కంభం చెరువుకు సమీపంలో ఉన్న ఈ స్టేషన్‌ను స్థానిక ప్రాంత ప్రాధాన్యతను ప్రతిబింబించేలా తీర్చిదిద్దారు. ప్రయాణికుల కోసం విశాలమైన వేచి ఉండే హాళ్లు, ఆధునిక టికెట్ కౌంటర్లు, డిజిటల్ సమాచార వ్యవస్థ, మెరుగైన ప్లాట్‌ఫారమ్‌లు, కొత్త షెల్టర్లు, స్వచ్ఛమైన తాగునీటి సౌకర్యం, పరిశుభ్రమైన మరుగుదొడ్లు, దివ్యాంగులకు అనుకూలంగా ర్యాంపులు, టాక్టైల్ పాత్‌వేలు, సులభ రాకపోకలకు అవసరమైన మౌలిక వసతులు ఏర్పాటు చేశారు. స్టేషన్ ఆవరణను ఆకర్షణీయమైన ల్యాండ్‌స్కేపింగ్, ఆధునిక లైటింగ్‌తో అభివృద్ధి చేయడంతో పాటు స్థానిక సంస్కృతి, వారసత్వాన్ని ప్రతిబింబించే కళాఖండాలతో అలంకరించారు. ఈ నెల 17వ తేదీన ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్ విధానంలో ఈ స్టేషన్‌ను జాతికి అంకితం చేయనుండగా, ఈ అభివృద్ధితో కంభం ప్రాంత ప్రజలకు మరింత నాణ్యమైన రైల్వే సేవలు అందుబాటులోకి రానున్నాయి.

Related posts

2024లో తగ్గాం.. ఇప్పుడు తగ్గేదే లేదు.

వైసీపీ ఎమ్మెల్సీ వరుదు కల్యాణికి షాక్

కూటమి పాలనలో రౌడీ పోలీస్ రాజ్యం ఎక్స్ వేదికగా వైఎస్ జగన్ తీవ్ర ధ్వజం