పల్నాడు జిల్లా వైఎస్సార్‌సీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి డిమాండ్
Palnadu District: కూటమి ప్రభుత్వంలో అర్హులైన నిరుపేద తల్లులకు ‘తల్లికి వందనం’ పథకం అందకుండా పోతోందని, పార్టీలతో సంబంధం లేకుండా పథకాన్ని కోల్పోయిన వారందరికీ తక్షణమే న్యాయం చేయాలని పల్నాడు జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి డిమాండ్ చేశారు. ‘తల్లికి వందనం’ ( Thalliki Vandanam ) రద్దయిన లబ్ధిదారుల జాబితాతో నరసరావుపేటలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ.. ఒక్క నరసరావుపేట నియోజకవర్గంలోనే దాదాపు 5,929 మంది నిరుపేదలకు విద్యుత్ బిల్లులు ఎక్కువగా వచ్చాయనో, 1,000 గజాల కంటే ఎక్కువ స్థలం ఉందనో, లేదా ఇన్కమ్ టాక్స్ చెల్లిస్తున్నారనే సాకులు చూపి ‘తల్లికి వందనం’ పథకాన్ని ఎగ్గొట్టారని మండిపడ్డారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ( Ys Jagan Mohan Reddy )పాలనలో ఈ విద్యార్థుల సంక్షేమ పథకానికి ఇన్కమ్ టాక్స్ నిబంధనలను సడలించారని, కానీ ప్రస్తుత ప్రభుత్వం నిరుపేద కుటుంబాలను కావాలనే పథకానికి దూరం చేస్తోందని విమర్శించారు.
ఆధార్ సంఖ్యలు తప్పుగా అనుసంధానం కావడం (ఆధార్ సీడింగ్ లోపాలు), అధికారుల సాంకేతిక తప్పిదాల వల్ల లబ్ధిదారులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆయన ఉదాహరణలతో వివరించారు. దుర్గ అనే నిరుపేద మహిళ ఆధార్ కార్డ్ ఒక ఎన్‌ఆర్‌ఐ ఆధార్‌కు తప్పుగా లింక్ అవ్వడం వల్ల, ఆమెను ఇన్‌కమ్ టాక్స్ పేయర్‌గా చూపి పథకాన్ని నిలిపివేశారని తెలిపారు. సొంతంగా ఇల్లు కూడా లేని, భర్త దివ్యాంగుడై జీవనం సాగిస్తున్న ఆ కుటుంబం రెండేళ్లుగా కలెక్టరేట్ చుట్టూ తిరుగుతున్నా అధికారులు స్పందించకపోవడం దారుణమన్నారు.
తల్లికి వందనం పొందేందుకు అర్హత ఉండి, సాంకేతిక మరియు అన్యాయమైన కారణాలతో పథకాన్ని కోల్పోయిన ప్రతీ ఒక్క లబ్ధిదారునికి తిరిగి లబ్ధి చేకూరేలా విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు. రద్దయిన లబ్ధిదారులందరికీ వెంటనే నిధులు విడుదల చేయకపోతే, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రజా ఆందోళనలను, పోరాటాలను రాబోయే రోజుల్లో మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో పల్నాడు జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు బాధితులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.