HDS సమావేశంలో ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద బాబు
Palnadu District: నర్సరావుపేట ప్రభుత్వ ఏరియా వైద్యశాలలో హాస్పిటల్ డెవలప్మెంట్ సొసైటీ (HDS) సమావేశం ఆసుపత్రి భవిష్యత్తు అభివృద్ధి ప్రణాళికలకు వేదికగా నిలిచింది. ఈ సమావేశానికి నరసరావుపేట శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవింద బాబు ముఖ్య అతిథిగా హాజరై, ఆసుపత్రిలో మెరుగైన వైద్య సేవలు, నూతన భవనాల నిర్మాణంపై కీలక ప్రకటనలు చేశారు.
నరసరావుపేట ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిని ఇప్పటికే జిల్లా ఆసుపత్రిగా అప్‌గ్రేడ్ చేశామని ఎమ్మెల్యే వెల్లడించారు. ప్రస్తుతం 200 పడకల సామర్థ్యంతో అన్ని విభాగాల్లో నిరంతరం ఓపీ సేవలు, సర్జరీలు అందిస్తున్నట్లు తెలిపారు. ఆసుపత్రి ప్రాంగణంలోని పాత భవనాలను తొలగించి, ఆ స్థానంలో నాబార్డు (NABARD) అందించిన రూ.55 కోట్ల నిధులతో అత్యాధునిక ‘తల్లీబిడ్డల ఆరోగ్య సముదాయం’ (MCH Block) నిర్మించనున్నట్లు స్పష్టం చేశారు.
ఈ నెలలోనే రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి నరసరావుపేట ఆసుపత్రిని సందర్శించనున్నారని ఎమ్మెల్యే చదలవాడ తెలిపారు. మంత్రి పర్యటన నేపథ్యంలో ఆసుపత్రికి తక్షణమే అవసరమైన మౌలిక సదుపాయాలు, ఇతర వసతులపై ముందస్తుగా చర్చించి, వారి దృష్టికి తీసుకెళ్లేందుకే ఈ HDS సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు వివరించారు. మంత్రి పర్యటన ముగిసిన వెంటనే MCH భవన నిర్మాణ ప్రణాళికలను ఖరారు చేస్తామని చెప్పారు.
ఆసుపత్రికి వచ్చే రోగులు, వారి సహాయకుల సౌకర్యార్థం తాగేందుకు స్వచ్ఛమైన మంచినీటి సరఫరా, ఆధునిక రెస్ట్ రూమ్స్ (విశ్రాంతి గదులు) ఏర్పాటు చేయడానికి సమావేశంలో ఏకగ్రీవంగా తీర్మానించారు. జిల్లా కలెక్టర్ పర్యవేక్షణలో ఈ అభివృద్ధి పనులన్నింటినీ వేగవంతంగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో HDS కమిటీ చైర్మన్ లక్కిరెడ్డి వెంకటేశ్వర రెడ్డి, కమిటీ సభ్యులు డాక్టర్ భారతీ దేవి, మిరియాల వెంకట సుబ్బమ్మ, తవ్వా మల్లికార్జునరావుతో పాటు పలువురు వైద్యులు, ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు.